ఆటగాళ్లకు అందలం
తొమ్మిది మంది క్రీడాకారులను డీఎస్పీలుగా నియమించిన పంజాబ్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తమ రాష్ట్ర క్రీడాకారులను పంజాబ్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. తొమ్మిది మందినిS డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లుగా నియమించింది. ఇందులో ఏడుగురు హాకీ క్రీడాకారులున్నారు. స్పోర్ట్స్ కోటా కింద వీరికి ఉద్యోగావకాశం కల్పించింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ వీరికి నియామక పత్రాలు అందించారు.
2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన పురుషుల హాకీ జట్టులో ఉన్న మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్, స్ట్రయికర్ ఆకాశ్‌దీప్ సింగ్, సర్వన్జిత్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, గుర్విందర్ సింగ్ చండి, ధరమ్వీర్ సింగ్‌లు డీఎస్పీలయ్యారు. 2014 ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో అథ్లెటిక్స్ 400 మీటర్లలో స్వర్ణాలు సాధించిన మన్దీప్ కౌర్... ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన అథ్లెట్ ఖుష్బీర్ కౌర్ (20 కి.మీ. నడక)... ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలైన అమన్‌దీప్ కౌర్‌లను కూడా డీఎస్పీలుగా నియమించారు.