010 పద్దు ద్వారా జీతాలు చెల్లించండి
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలోని అర్చకులు, ఉద్యోగులు, దేవాదాయ సంస్థల సిబ్బందికి జీత భత్యాలు ట్రెజరీ 010 పద్దు ద్వారా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాదాయ ధర్మాదాయ సంస్థల వేతన అర్చక, ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ కన్వీనర్ విత్తనాల శ్రీనివాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక షిర్డీసాయి కల్యాణ మండపంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేతనాల విషయంలో స్పష్టంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి 19 ఏళ్లు, చట్టంలో మార్పులు చేసి ఎనిమిదేళ్లు గడచిపోయిందన్నారు. సవరించిన దేవాదాయ చట్టం 3187 ప్రకారం అర్చకులకు, ఉద్యోగులకు ఒకనిధి ఏర్పాటుచేసి, ఆ నిధి నుంచి జీతభత్యాలు ఇవ్వాలని జారీచేసిన జీఓలు 280, 326, 417 అమలుకు నోచుకోవడంలేదుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రులకు వినతి పత్రాలిచ్చినా ఫలితంలేదని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు వినతి పత్రం అందించామని తెలిపారు. సమావేవంలో అర్చక జేఏసీ కన్వీనర్ జి.శ్రీనివాసు. ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ వి.శ్రీనివాసు, కొడవటిగంటి లక్ష్మణాచార్యులు, ఎం.అజయ్ పాల్గొన్నారు.