కోలాం గిరిజనుల అభివృద్ధికి కృషి
- ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్
- కోలాం గ్రామాల ప్రజలతో సమావేశం
ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీ కోలాం గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏ అన్ని రకాలుగా కృషి చేస్తోందని ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో నార్నూర్ మండలం ఖడ్కి, ముద్గుంగూడ, ముగ్దాపూర్, సుంగపూర్, చిట్టాగూడ, డొంగార్గాం, చోర్గాం, భీంజీగూడ, నార్నుర్, అర్జునిరావలగూడ, కుడికాస, పర్సువాడ, పర్సువాడ(జే), ర్సువాడ(బీ), సెడ్వాయి, పిప్రి, లొద్దిగూడ, కుండి గ్రామాల కోలాం ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా కోలాం గిరిజనుల అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తోందని చెప్పారు.
కోలాంల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతోందని, సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో మూఢ నమ్మాకాలను నమ్మకుండా ప్రభుత్వ వైద్యం చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణులను ప్రసవం కోసం ఆస్పత్రులకు తీసుకెళ్లాలని, ఇంటి వద్ద ప్రసవాలు చేయొద్దని అన్నారు. పత్తి సాగుపైనే ఆధారపడకుండా అంతర పంటలు సజ్జ, సోయా, నువ్వులు, పెసర, కంది తదితర పంటలు సాగు చేయడం ద్వారా ఆర్థిక చేయూత లభిస్తుందని తెలిపారు. అర్హులైన కోలాంలకు వ్యక్తిగత హక్కు పత్రాలు అందిస్తామని అన్నారు.
వైద్యులపై పీవో ఆగ్రహం
జైనూర్ : ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ జైనూర్ పీహెచ్సీ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఆయన పీహెచ్సీని తనిఖీ చేశారు. రోగులను వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. ఒక రోగికి గంటల తరబడి చికిత్స చేయక, రక్తపూతలు సేకరించలేదని తెలియడంతో.. వైద్య సేవలపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ స్టాఫ్నర్స జయవంత, భారతిలను మందించారు. ఒక నెల వేతనం నిలిపి వేయాలని ఎస్పీహెచ్వోను ఆదేశించారు. పీవో వెంట ఎస్పీహెచ్వో డాక్టర్ వాణి, వైద్యాధికారి నాగేంద్ర ఉన్నారు. కాగా, మరణాలు సంభవించకుండా ప్రత్యేక దృష్టి సారించిన పీవో.. అర్ధరాత్రి తనిఖీలు చే యడంతో ఉద్యోగులు హడలిపోతున్నారు.