రెండేళ్లలో 3,000 ఉద్యోగాల భర్తీ!
♦ సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ దేవేంద్ర సహారియా
♦ హైదరాబాద్‌లో ఏజీఎస్ హెల్త్ రెండో కేంద్రం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆరోగ్య విశ్లేషణ, మెడికల్ కోడింగ్ సేవలందిస్తున్న అమెరికాకు చెందిన ఏజీఎస్ హెల్త్... 3 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో హైటెక్‌సిటీలో తన రెండో కేంద్రాన్ని ప్రారంభించింది. బేగంపేటలో 600 సీట్ల సామర్థ్యం గల తొలి కేంద్రాన్ని ఈ సంస్థ గతేడాది ప్రారంభించింది. ఈ రెండు కేంద్రాల్లో కలిపి సుమారు 1,500 మంది ఉద్యోగులుంటారని.. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 3 వేలకు తీసుకెళతామని ఏజీఎస్ హెల్త్ ఫౌండర్ అండ్ సీఈఓ దేవేంద్ర సహారియా చెప్పారు.
బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం ఇండియా, అమెరికాలో కలిపి మొత్తం 13 కార్యాలయాలున్నాయి. 10-12 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశంలో తమిళనాడులోని వెల్లూరులో 4, చెన్నైలో 4, నోయిడాలో 1, హైదరాబాద్‌లో 2 మొత్తం 11 కార్యాలయాలను ఏర్పాటు చేశాం’’ అని వివరించారు. హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిలదొక్కుకున్న అనంతరం ద్వితీయ శ్రేణి పట్టణాలకూ విస్తరిస్తామని.. అలాగే డేటా ఇంటిగ్రేషన్, అనలిటిక్స్ విభాగాల్లోనూ సేవలను విస్తరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈడీఅండ్ హైదరాబాద్ హెడ్, ఆశీష్ అగర్వాల్, హెచ్ఆర్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ ఈడీ స్మితా వెంకటరామన్ పాల్గొన్నారు.