అబ్బాయి ఫొటో మార్ఫింగ్.. ఫేస్బుక్లో అసభ్య చిత్రాలు!!
సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి వాళ్ల ఫేస్బుక్ ప్రొఫైళ్లలోను, ఇతర పోర్న్ వెబ్సైట్లలోను అసభ్యంగా పోస్ట్ చేయడం చూస్తుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సరిగ్గా ఇందుకు వ్యతిరేకంగా జరిగింది. తన బోయ్‌ఫ్రెండ్ మీద ప్రతీకారం తీర్చుకోడానికి అతడి ఫొటోను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసిన యువతి.. వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దేవేశ్ శర్మ అనే వ్యక్తి ఇప్పుడిప్పుడే వ్యాపార రంగంలో కాస్త కుదురుకుంటున్నాడు. '20 సమ్‌థింగ్ గాళ్' అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ఓ యువతి అతడికి పరిచయం అయ్యింది. వాళ్లిద్దరూ ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్లు. 23 ఏళ్ల వయసున్న ఆమె సోదరికి తన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చేందుకు కూడా అతడు ఒప్పుకొన్నాడు.
తర్వాత బయటకు పార్టీలకు వెళ్దామని అతడిని పిలవసాగింది. ఈలోపు ఆగస్టు మూడోతేదీ.. స్నేహితుల దినోత్సవం వచ్చింది. ఆరోజు బయటకు పార్టీకి వెళ్దామని, తనకు రూ. 4,500 పెట్టి హ్యాండ్‌బ్యాగ్, రూ. 9వేలు పెట్టి మినీస్కర్టు కొనివ్వాలని, అవి వేసుకుని పార్టీకి వస్తానని చెప్పింది. ఇలా మొదలుపెడితే ఇక తన పని అంతేనని అర్థం చేసుకున్న దేవేష్ శర్మ.. ఆమెను కలవకుండా ఊరుకున్నాడు. అప్పటికి వాళ్లు ఒకసారి కూడా కలవలేదు. అయితే ఇంటర్నెట్లోను, ఫోన్లో మాత్రం ఆమె అతడిని పలకరిస్తూనే ఉంది. మళ్లీ ఖరీదైన బహుమతులు అడగడంతో దేవేష్ ఎందుకొచ్చిందని ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆ తర్వాతి రోజు ఏకంగా వంద సార్లు ఫోన్ చేసి, 50 ఎస్ఎంఎస్లు ఇచ్చింది. తన డిమాండ్లను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఎస్ఎంఎస్లలో బెదిరించింది.
అయినా దేవేష్ పట్టించుకోలేదు. దాంతో అతడి ఫొటోలను ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి సంగ్రహించి, వాటిని మార్ఫింగ్ చేసి అతడి పేరుమీద తప్పుడు ప్రొఫైల్ సృష్టించి, అందులో అతడి ఫొటోలను అత్యంత అసభ్యంగా పోస్ట్ చేసింది. దాంతోపాటు బూతు వెబ్సైట్లలో కూడా ఆ ఫొటోలను, అతడి ఫోన్ నెంబరును పోస్ట్ చేసింది. దేవేష్ స్వలింగ సంపర్కుడని అందులో రాసింది. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న కుర్రాడు.. చేసేదేమీ లేక సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు ఆమె ఐపీ అడ్రస్‌ను బట్టి ఆమె మానక్నగర్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దాంతో ఆమె దేవేష్కు క్షమాపణ చెప్పి, ఆ ప్రొఫైల్ డిలిట్ చేసింది. ఇలాంటి కేసు ఇదే మొదటిసారని, అబ్బాయిలు కూడా ఇలా ఇబ్బంది పడటం ఇంతకుముందెప్పుడూ లేదని సైబర్ సెల్ పోలీసులు అన్నారు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)