DGB
-
ప్రాణాలు హరీ...!
న్యూఢిల్లీ: నగరంలోని మ్యాన్‌హోళ్లు మత్యువుకు చిరునామాగా మారాయి. వీటివల్ల ప్రతి ఏడాది వందమంది పారిశుధ్య సిబ్బంది చనిపోతున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రత, కాలుపెడితే సర్రున జారిపోయేవిధంగా ఉండే గోడలు, విషవాయువులు ఇందుకు కారణమవుతున్నాయి. నగరంలోని మురుగుకాల్వలపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. మరమతు పనులకోసం వీటిలో దిగుతున్న సిబ్బంది అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. మరికొంతమంది ఏకంగా చనిపోతున్నారు. నేషనల్ క్యాంపెయిన్ ఫర్ డిగ్నిటీ అండ్ రైట్స్ ఫర్ సీవరేజ్ అల్లైడ్ వర్కర్స్ (ఎన్‌సీడీఏఆర్‌ఎస్‌ఏడబ్ల్యూ)తోపాటు ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఓహెచ్‌ఎస్‌ఎంసీఎస్) అనే రెండు సంస్థల సహకారంతో ప్రాక్సిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ పార్టిసిపేటరీ ప్రాక్టీసెస్ అనే మరో సంస్థ ఈ అంశంపై అధ్యయనం చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం నగరంలో ప్రతిరోజూ 2,871 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. దాదాపు ఐదువేల మంది పారిశుధ్య సిబ్బంది వీటిని తరచూ శుభ్రం చేస్తుంటారు. అయితే వారికి కల్పిస్తున్న వైద్యసదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతోపాటు వారి భద్రతకు ఆయా కార్పొరేషన్లు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రమనే విమర్శలు లేకపోలేదు.ఈ కారణంగా వారు అనేకమైన భీకర వ్యాధులబారినపడుతున్నారని సదరు నివేదిక పేర్కొంది. ఇదిలాఉంచితే వారికి ఇస్తున్న వేతనాలు కూడా అంతంతే. దీనికితోడు కులవివక్ష, పక్షపాతం, వత్తిపరమైన భద్రత లేమి తదితర సమస్యలు వారిని నీడమాదిరిగా వెన్నాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పారి శుధ్య సిబ్బంది జీవన ప్రమాణాలపై అందరికీ అవగాహన కల్పించి వారి జీవితాలు మెరుగుపడేందుకు ఆయా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసేందుకే తాము ఈ అధ్యయనం నిర్వహించామని ప్రాక్సిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ పార్టిసిపేటరీ ప్రాక్టీసెస్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయమై ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) కార్మిక సంఘం సభ్యుడు వేద్‌ప్రకాశ్ మాట్లాడుతూ రహదారిపైగల మ్యాన్‌హోళ్లలో దిగి వీరంతా మరమ్మతు పనులు నిర్వర్తిస్తుంటారని, దీంతో వీరిని మత్యుభయం వెన్నాడుతుందన్నారు. పారిశుధ్య సిబ్బందికి మౌలిక వసతులు కరువయ్యాయన్నారు. రహదారులపై రాకపోకలు సాగించేవారు వారిని దుర్భాషలాడుతుంటారన్నారు. రోడ్డుపై మురుగు పోస్తున్నావంటూ మండిపడుతుంటారన్నారు. -
నీటి చౌర్యానికి ఇక అడ్డుకట్ట
న్యూఢిల్లీ: నీటి చౌర్యానికి ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) ఇక అడ్డుకట్ట వేయనుంది. ఇందులోభాగంగా ఆయా ప్రాంతాలకు సరఫరా అవుతున్న నీరు, బిల్లు రూపంలో లెక్కలోకి వస్తున్న నీటి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ‘కొత్త వ్యవస్థలో భాగంగా జిల్లా మీటరింగ్ ఏరియా (డీఎంఏ)లను ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాం తాలకు సరఫరా అవుతున్న నీటి పరిమాణంపై నిఘా ఉంచుతాం. మీటర్ల ద్వారా సరఫరా అవుతు న్న నీటి పరిమాణం లెక్కల్లోకి వస్తుందన్నారు. అయితే ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా కోసం ఏర్పాటుచేసిన కనెక్షన్లలను కూడా ఇకమీదట పరిగణనలోకి తీసుకుంటాం. ఇందువల్ల ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలిసిపోతుంది. తద్వారా ఎంత నీరు చౌర్యానికి గురవుతున్నదనే విషయం కూడా తేలిగ్గా అర్థమవుతుందన్నారు. చౌర్యానికి గురవుతున్న నీటిని నాన్ రెవెన్యూ వాటర్ (ఎన్ఆర్డబ్ల్యూ) కింద తాము పరిగణిస్తామన్నారు. ఢిల్లీలాంటి మహానగరంలో ఎన్ఆర్డబ్ల్యూ అనేది అత్యంత కీలకమైనదన్నారు. ఇటువంటి నగరాల్లో ప్రజలకు అవసరమైన నీటి పరిమాణం, సరఫరాల మధ్య వ్యత్యాసం ఎంతో ఉంటుందన్నారు. ఆ డిమాండ్‌ను అందుకోవడం అంత తేలికైన విషయం కాదన్నారు. ద్వారక లాంటి కీలక ప్రాంతాలు కూడా నీటి కొరతతో సతమతమవుతున్నాయన్నారు. ముడి జలాల కొరతే ఇందుకు కారణమన్నారు.ముడిజలాల కోసం పరిసర రాష్ట్రాల్లోని జలాశయలపై ఆధారపడక తప్పడం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో 11 నుంచి 12 శాతం నీరు సరఫరా సమయంలో వథా అవుతుందన్నారు. ట్యాం కులు నిండిపోయిన సమయంలో కూడా నీరు వృ థా అవుతుందని, మరో 40 శాతం జలాలు చౌర్యానికి గురవుతున్నాయన్నారు. డీజేబీ గణాంకాల ప్రకారం నగరానికి ప్రతిరోజూ 1,080 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. అయితే ఆయా జలశుద్ధీకరణ కేంద్రాల్లో ప్రతిరోజూ 850 మిలియన్ గ్యాలన్లనీటిని సంబంధిత సిబ్బంది శుద్ధి చేస్తారు. అయితే శుద్ధి చేసి సరఫరా చేస్తున్న జలాల్లో సగం మేర కూడా రాబడి రావడం లేదు. ఆయా ప్రాంతాల్లో డీఎంఏలను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించామన్నారు. నగరంలో 5.25 లక్షల ఆటోమేటిక్ మీటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి.2015 నాటికి వీటి సంఖ్యను ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలకు పెంచాలనేది తమ లక్ష్యమన్నారు. కొంతమంది వినియోగదారులకు రెండు కనెక్షన్లు కూడా ఉన్నాయన్నారు. అందులో ఒకటి మీటర్ కలిగినది కాగా మరొకటి మీటర్ లేనిదని అన్నారు. ఈ తరహా వినియోగదారులు అనేకమంది ఉన్నారన్నారు. నిరుపేదలు నివసించే కాలనీల్లోనే కాకుండా ధనవంతులు జీవించే ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. -
సబ్సిడీలకు స్వస్తి
న్యూఢిల్లీ:ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత నీటి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొనసాగడం కష్టమేనని తెలుస్తోంది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రాయితీల కోసం నిధులు కేటాయించకపోవడమే ఇందుకు కారణం. ఏప్రిల్ నుంచి రాయితీలు కొనసాగకపోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాత్సవ ఇటీవల అన్నారు. ఉచిత నీటి పథకం రద్దయితే ఢిల్లీవాసులు నీరు, విద్యుత్‌కు విపరీతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత నీటి పథకం ప్రకారం కుళాయి కనెక్షన్లు ఉన్న వారికి నెలకు 20 వేల లీటర్ల చొప్పున నీరు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అయితే ఈ పథకం కొనసాగింపుపై తమ వద్ద కచ్చితమైన సమాచారం ఏదీ లేదని ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ) అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉందని, సబ్సిడీలు కూడా తొలగించారు కాబట్టి రాయితీ కొనసాగింపుపై త్వరలో జరిగే డీజేబీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విద్యుత్,నీటి పథకాల రాయితీల కోసం 2013-14 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించని మాట నిజమేనని ఆర్థికశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉచిత నీటి పథకం అమలు కోసం డీజేబీకి ప్రతి నెలా రూ.165 కోట్లు ఖర్చవుతోంది. రాయితీల తొలగింపు కారణంగా డిస్కమ్‌లు చార్జీల మోత మోగిస్తుండగా, ఏప్రిల్ నుంచి నీటి బిల్లులు కూడా వీటికి తోడవుతాయని ఢిల్లీవాసులు భయపడుతున్నారు. ఈ పథకం కొనసాగించాలని డీజేబీ నిర్ణయించుకుంటే ప్రభుత్వం దానిని ఆమోదించాల్సి ఉంటుందని సంస్థ మాజీ అధికారి ఒకరు అన్నారు. రాయితీల కొనసాగింపు, పరిహారం చెల్లింపు కోసం డీజేబీ కేంద్రాన్ని సంప్రదించగా అక్కడి నుంచి ప్రతికూల స్పందన వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి. ఉచిత నీటి సరఫరా పథకాన్ని రద్దు చేయాలని ఆదేశించిందని ఆర్థికశాఖవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో డీజేబీ శుక్రవారం బోర్డు సమావేశం నిర్వహించనుంది. అయితే ఉచిత నీటి పథకంపై చర్చ ఎజెండాలో లేదు. సబ్సిడీ కొనసాగింపును లెఫ్టినెంట్ గవర్నర్ వ్యతిరేకిస్తే తాము ఏప్రిల్ నుంచి చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుందని ఆర్థికశాఖ అధికారి ఒకరు తెలిపారు. సబ్సిడీ తొలగిస్తే ఊరుకోం : ఆప్ ఉచిత నీటి పథకం రద్దు పూర్తిగా ప్రజావ్యతిరేక చర్య అని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అభిప్రాయపడింది. రాయితీలను తొలగిస్తే తాము భారీ ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర పొత్తును కూడా బట్టబయలు చేస్తామని హెచ్చరించింది. ‘అవినీతిమయమైన షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని కూలగొట్టినందుకు కాంగ్రెస్ ఇలా పగతీర్చుకుంటోంది. డీజేబీ స్వయంప్రతిపత్తి గల సంస్థ కాబట్టి దాని నిర్ణయాన్ని అడ్డుకునే శక్తి ఎల్జీ, కేంద్ర ప్రభుత్వానికి ఉండబోదు’ అని ఆప్ ప్రకటన తెలిపింది. అయితే ఉచిత నీటి పథకం అమలుకు అవసరమైనన్ని నిధులు డీజేబీ వద్ద ఉన్నాయి కాబ ట్టి దానిని కొనసాగించడం కష్టమేమీ కాదని నిపుణు లు చెబుతున్నారు. రూ.నాలుగు వేల కోట్ల వార్షిక బడ్జెట్ గల డీజేబీ ఉచిత నీటి సరఫరా కోసం రూ.160 కోట్లు ఖర్చు చేయడం కష్టం కాదని అంటున్నారు.ఇదిలా ఉంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు పార్లమెంటు గత శుక్రవారం ఆమోదించిన బడ్జెట్లో విద్యుత్ రాయితీ కోసం నిధులు కేటాయించలేదు. ఫలితంగా ఏప్రిల్ ఒకటి నుంచి రాయితీ కొనసాగకపోవచ్చని విద్యుత్‌శాఖ వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 400 యూనిట్ల వరకు వాడుకునే విద్యుత్ వినియోగదారులకు మార్చ్ 31 వరకు మాత్రమే 50 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ప్రజావ్యతిరేక నిర్ణయాల వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని కూడా రద్దుచేసే కుట్ర జరుగుతున్నట్లు తెలిసిందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వెనుక కాంగ్రెస్, బీజేపీల కుట్ర ఉందని ఆరోపించింది. ఒకవేళ తమకు అందిన సమాచారం సరైనదై, ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని రద్దు చేస్తే.. తమను ఓడించిన ఢిల్లీ ప్రజలపై యూపీఏ ప్రభుత్వం క్షక్ష తీర్చుకుంటోందనే విషయం రుజువైనట్లేనని ఆప్ పేర్కొంది. దీనిపై తమ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందని, బీజేపీ, కాంగ్రెస్‌ల అపవిత్ర పొత్తును ప్రజల్లోనే ఎండగడతామని ఆప్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ జల్‌బోర్డు స్వయం ప్రతిపత్తిగల సంస్థ అయినందున అది తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదేశించే అధికారం కేంద్రానికిగానీ, లెఫ్టినెంట్ గవర్నర్‌కుగానీ లేదని పేర్కొంది. తమ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం వల్ల ప్రభుత్వంపై పెద్ద భారమేమీ పడదన్నారు. డీజేబీకి కావలసినన్ని వనరులు ఉన్నందున పథకాన్ని అమలు చేస్తుందనే తాము భావిస్తున్నామన్నామని ఆ పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తమ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు అమలు కాకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుపడ్డాయని, చివరికి మంచినీటి సరఫరా విషయంలో కూడా నగరవాసులకు మేలు జరిగేలా ఆ రెండు పార్టీలు వ్యవహరించడంలేదని ఆయన విమర్శించారు. విద్యుత్ బిల్లుల మాఫీ విషయంలో కూడా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు నిలిపివేయడాన్ని గుర్తుచేశారు. ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చేది తామేనని, అప్పుడైనా ఈ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు.