సమన్వయంతో పనిచేయండి
– శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు
– వివిధ శాఖలతో సమావేశమైన ఏపీ డీజీపీ సాంబశివరావు
తిరుపతి క్రైం :
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పోలీసులు, విజిలెన్స్, టీటీడీ, వివిధ సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని ఏపీ డీజీపీ సాంబశివరావు ఆదేశించారు. శనివారం తిరుపతిలోని పోలీసు గెస్ట్ హౌస్‌లో ఆయన వివిధ శాఖల అధికారులు, పోలీసులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలన్నారు. గరుడసేవ రోజున ప్రత్యేక శ్రద్ధతో మరింత సిబ్బందిని పెంచాలన్నారు. అనుమానిత వ్యక్తులపై, తిరుపతి తిరుమలకు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఉగ్రవాదుల దాడులను దృష్టిలో వుంచుకుని పనిచేయాలన్నారు. తిరుపతిలో కొత్త వ్యక్తులపై వారి కదలికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. ఆర్టీసిబస్టాండు, రైల్వే స్టేషన్లలో నిఘా భద్రతను పెంచాలన్నారు. నిరంతరం బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లచే ముమ్మర తనిఖీలు చేయాలన్నారు. గరుడసేవ రోజున ద్విచక్ర వాహనాలను అనుమతించకూడదన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా శాఖతో కలసి వీటి కదలికలపై దృష్టిసారించాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ లాఅండ్ ఆర్డర్ డీజీ ఆర్పీ ఠాగూర్, రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ ప్రభాకర్‌రావు, చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు, అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి, ఆర్టీసి, విజిలెన్స్ అ«ధికారులు, పోలీసు ఉన్నతా«ధికారులు పాల్గొన్నారు.