అంజన్నకు భక్తాభిషేకం
కొండగట్టు అంజన్న క్షేత్రంలో చిన్నహనుమాన్
జయంతి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
మల్యాల, న్యూస్‌లైన్ : కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానం భక్త జన సంద్రమైంది. సోమవారం చిన్నహనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆంజనేయస్వామి దీక్షాపరులు తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు జిల్లా నలుమూలలనుంచే కాకుండా నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా వేలాది మంది దీక్షాపరులు కొండగట్టుకు చేరుకుంటున్నారు. అంజన్న సన్నిధానంలో దీక్షలు విరమించి, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొండపైన నీటి ఎద్దడి ఉండడంతో ట్యాంకర్లద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు దేవస్థాన ఈవో గజరాజు తెలిపారు.
వేకువజాము నుంచే దర్శనం
వేలాది మంది భక్తులు తరలిరావడంతో సోమవారం వేకువజాము నుంచే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అధికారులు వేకువజామున 4గంటల నుంచే స్వామివారి దర్శనానికి అనుమతించారు. కోనేటిలో స్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. కల్యాణకట్ట భవనంలో అర్చకులు దీక్షవిరమణ నిర్వహించారు. పుష్కరిణి వద్ద ఎప్పటిలాగే తలనీలాల కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఆలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఘాట్‌రోడ్డు వెంట చలివేంద్రాలను ఏర్పాటుచేశారు.
కొండపై అదనంగా స్వామివారి ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటుచేశారు. జయంతి రోజు దాదాపు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీతో వ్యాపారులు వస్తువుల ధరలను అమాంతం పెంచేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మల్యాల ఎస్సై వెంకటేశ్వర్లు బందోబస్తు నిర్వహించారు.