ఆ మాజీ ఎంపీ ప్రచారానికి 4వేల అల్లుళ్లు, కూతుళ్లు!
ఎప్పుడో పురాణాల్లో వందలాది కుటుంబ సభ్యులు యుద్దాల్లో పాల్గొన్నారని చరిత్ర పాఠ్యాంశంలో చదువుకున్నాం. కాని పురాణాల్లో కాకుండా తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఓ ఆసక్తిని రేకెత్తించే అంశం ఓటర్లను ఆకర్షిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో దక్షిణ సోలాపూర్ నియోజకవర్గంలో బీజేపీ తరపున సుభాష్ దేశ్ ముఖ్ పోటి చేస్తున్నారు. ఈ మాజీ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆయన తరపున 4 వేల మంది కూతుళ్లు, అల్లుళ్లు చెమటోడుస్తున్నారు. అయితే ఈ రోజుల్లో వేలాది మంది కూతుళ్లు ఎలా ఉన్నారనే సందేహం కలుగడం సహజమే.
లోక మంగళ్ గ్రూప్ అనే స్వచ్చంద సేవా సంస్త ద్వారా గత ఏడేళ్లలో 2 వేల మంది యువతులకు దేశ్ ముఖ్ సామూహిక వివాహాలు జరిపించారు. పేద కుటుంబాల్లో ఎవరూ అప్పుల బారిన పడకుండా ఆ కుటుంబాలకు చెందిన యువతులకు ప్రతి నవంబర్ లో సామూహిక వివాహాలను జరిపించే కార్యక్రమంలో దేశ్ ముఖ్ నిమగ్నమయ్యారు.
వివాహంతోపాటు బట్టలు, నిత్యావసర వస్తువులతోపాటు ఆ దంపతులకు అమ్మాయి పుడితే 5 వేల రూపాయలను కూడా దేశ్ ముఖ్ ఇస్తుంటారు. ఇలా రెండు వేల సామూహిక వివాహాల జరిపించడం ద్వారా ప్రస్తుతం నాలుగు వేల మంది కూతుళ్లు, అల్లుళ్లు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి దిలీప్ మానే వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.