దర్శకుడి ఇంట్లో బాలకార్మికులు
సీనియర్ దర్శకుడు, సంగీత దర్శకుడు గంగైయమరన్ ఇంట్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కమిటీ అధికారులు రెండు రోజులుగా విచారణ జరుపుతున్నారు. గంగైయమరన్ ఇంట్లో ఇద్దరు బాల కార్మికులు పని చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ జరుపుతున్నారు. స్థానిక అడయారులోని వెంకటరత్నం నగర్లో దర్శకుడు గంగైయమరన్ నివసిస్తున్నారు. ఈయన ఇంట్లో ఇద్దరు బాలకార్మికులు పని చేస్తున్నట్లు ఆ సమీపంలోని యువతి ఒకరు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కమిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది.
దీంతో మంగళవారం సాయంత్రం అధికారులు గంగైయమరన్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఆ సమయంలో పని పిల్లలు అక్కడే ఉన్నారు. అయితే వారి తల్లిదండ్రుల ఇష్టానుసారంగానే ఆ పిల్లల్ని పనికి చేర్చుకున్నట్లు గంగైయమరన్ కుటుంబ సభ్యులు అధికారులకు వెల్లడించారు. అధికారులు పని పిల్లల పుట్టిన తేదీ, సర్టిఫికెట్లు తీసుకురావాలని విల్లుపురంలో వున్న వారి తల్లిదండ్రులకు కబురు పంపారు. పని పిల్లల తల్లిదండ్రులు బుధవారం సాయంత్రం గంగైయమరన్ ఇంటికి చేరుకున్నారు. విచారణ కొనసాగుతోంది.