‘ఆ డైరెక్టర్‌ను బూటుతో కొడితే.. డబ్బులిస్తా’
ముంబై: చారిత్రక కథాంశంతో నిర్మిస్తున్న బాలీవుడ్ సినిమా పద్మావతి గురించి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ వివరణ ఇచ్చినా వివాదం సద్దుమణగలేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత అఖిలేష్ ఖండెల్వాల్.. భన్సాలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భన్సాలీని బూటుతో కొట్టినవారికి పది వేల రూపాయల నజరానా ఇస్తానని ప్రకటించారు. మహారాణి పద్మిని చరిత్రను వక్రీకరించి, ఆమెను అగౌరవ పరిచేలా పద్మావతి సినిమాలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో రాజ్పుట్ కర్ని సేన సభ్యులు పద్మావతి సినిమా షూటింగ్ సెట్‌ను ధ్వంసం చేసి, భన్సాలీని చెంపదెబ్బ కొట్టి జుట్టు పట్టుకుని లాగిన సంగతి తెలిసిందే. దీనిని బాలీవుడ్ పరిశ్రమ ఖండించగా, రాజ్ పుట్ వర్గీయులు మాత్రం నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఈ గొడవ అనంతరం భన్సాలీ వివరణ ఇచ్చారు. పద్మావతి సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని, రాణి పద్మిని, అలావుద్దీన్ ఖల్జీ మధ్య ప్రేమ సన్నివేశాలు లేవని చెప్పారు. అయినా శాంతించని రాజ్ పుట్ వర్గీయులు.. ఈ సినిమా టైటిల్‌ను మార్చాలని, విడుదలకు ముందు తమకు చూపించాలని డిమాండ్ చేశారు.
(చదవండి: షూటింగ్లో ప్రముఖ దర్శకుడిపై దాడి)