పుష్కరాలకు సన్నద్ధంకండి!
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పనుల పెండింగ్‌పై ఆగ్రహం
సాక్షి, అమరావతి: పుష్కర పనుల తీరుపై కలెక్టర్ కాంతిలాల దండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి అధికారులతో గుంటూరులో ఆయన సమీక్ష నిర్వహించారు. పుష్కర విధుల్లో పాల్గొనే ఉద్యోగుల గుర్తింపు కార్డులు వెంటనే తయారు చేయాలన్నారు. ఘాట్ల లేటెస్టు ఫొటోలను వెబ్సైట్లో పొందు పరచాలని ఆదేశించారు. పుష్కరాల కరదీపక కోసం అన్ని శాఖలు సమాచారం ఇవ్వాలన్నారు. ఫుష్కర నగర్ల నుంచి ఘాట్ల వద్దకు భక్తులను చేర వేసేందుకు వీలుగా జిల్లాలోని స్కూల్, కాలేజీ బస్సులను సిద్ధం చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. పుష్కర పూజా సామగ్రి కిట్ల విషయమై చర్చించారు. సత్తెనపల్లి, గుంటూరు, మంగళగిరి, పెదకూరపాడు, రైల్వే స్టేషన్ల నుంచి బస్సులను ఘాట్ల వద్దకు ఎక్కువ సంఖ్యలో నడపాలని చెప్పారు. మెడికల్, శానిటేషన్, తాగునీరు ఏర్పాట్లపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రేపల్లె ఘాట్‌లో జల్లు స్నానాలు ఏర్పాటు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు, ఎల్ఈడీలు, లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఘాట్లకు వెళే మార్గాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.