ఘనంగా వైఎస్సార్ జయంతి
♦ అభివృద్ధిలో మహానేతకు సాటిలేరు
♦ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు గైనికాడి విజయలక్ష్మి
♦ ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
వినాయక్‌నగర్ : పేదల కోసం ఎన్నో సంక్షేమం పథకాలు ప్రవేశపెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జనం మెచ్చిన నేతగా, రాష్ట్రానికి పెద్దన్నలా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గైనికాడి విజయలక్ష్మి అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్‌లో వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ, ఆపదలో ఉన్నవారిని ఆస్పత్రికి చేర్చేందుకు అంబులెన్స్‌లు, పేదలకు ఖరీదైన వైద్యం అందడానికి ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అమలు చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మి, రాధిక, సోని, యమున, శశికళ, నర్సవ్వ, సంగీత, అరుణ, మల్లవ్వ, మంజుల, సత్తమ్మ, రాణి, జమున, గంగమ్మ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌భవన్‌లో..
నిజామాబాద్ సిటీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. డీసీసీ, సీసీసీ అధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, కేశవేణులు కాంగ్రెస్ నాయకులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఆయన హయాంలో జిల్లాలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ జరిగిందని తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బంటు బలరాం, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు(వెంకుల్), కిసాన్‌కేత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్పా గంగారెడ్డి, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్ హైమద్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు కేతావత్ మోహన్, నగర అధ్యక్షుడు సుభాష్‌జాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు నరాల రత్నకర్, మహిళా నాయకులు స్వర్ణలత, పోలా ఉషా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బంటు రాము, రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు విపుల్‌గౌడ్, ఎస్సీసెల్ నగర చైర్మన్ రాజ్‌గగన్ తదితరులు పాల్గొన్నారు.