పోలీస్ శాఖలో ఇద్దరు సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కానిస్టేబుళ్లు, జిల్లా పోలీస్ కార్యాలయ ఉద్యోగులు కలసికట్టుగా సాగించిన మెడికల్ లీవుల కుంభకోణంపై జిల్లా ఎస్పీ డాక్టర్ కె.రఘురామిరెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. ‘లీవుల స్వాహా’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉద్యోగుల మెడికల్ లీవులను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయకుండా అవకతవకలకు పాల్పడిన జిల్లా పోలీస్ కార్యాలయంలోని ‘ఏ సెక్షన్’ విభాగం జూని యర్ అసిస్టెంట్లు లంకా కిషోర్, హలీమ్‌ను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ మెడికల్ లీవుల అవకతవకలపై ఇప్పటికే తమకు సమాచారం ఉందన్నారు. సమగ్ర వివరాలతో వచ్చిన ‘సాక్షి’ కథనం ఆధారంగా లోతైన విచారణ చేస్తామని చెప్పారు.
మెడికల్ లీవులను సర్వీసు రిజిస్టర్లో నమోదు చేయించకుండా జీతాలు పొందిన కానిస్టేబుళ్ల వేతనాల్లో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు, రాష్ట్ర ఖజానా విభాగానికి లేఖ రాస్తామని చెప్పారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో మరోసారి ఇటువంటి అవకతవకలకు పాల్పడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాథమికంగా ఆ ఇద్దరు ఉద్యోగులదే తప్పని తేలడంతో వారిని సస్పెండ్ చేశామని, వీరితోపాటు ఆ విభాగంలో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయమై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.