తప్పొకరిది.. శిక్ష మరొకరికి
ఫ్రాంకింగ్, స్టాంప్ పత్రాల కుంభకోణంలో విచిత్రం
తప్పు చేసింది ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు
కోర్టు చుట్టూ తిరుగుతోంది స్టాంపు వెండర్లు
కరీంనగర్ అర్బన్ : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన ఫ్రాంకింగ్, స్టాంపు పత్రాల కుంభకోణంలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు చేసిన తప్పునకు స్టాంపు వెండర్లు శిక్ష అనుభవిస్తున్నారు. చలాన్ చెల్లించకుండా కొనుగోలు చేసిన పాపానికి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. హుజూరాబాద్, మంథని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసిన విజయ్‌భాస్కర్, సురేశ్ స్టాంపుల లోడింగ్ వ్యవహారంలో రూ. 9లక్షలు, స్టాంపుల విక్రయాలలో రూ.8 లక్షలకుపైగా కాజేసి జేబులు నింపుకున్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సురేశ్‌ను అరెస్టు చేశారు. భాస్కర్ మూడు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు.
పాపం.. స్టాంప్ వెండర్స్
స్టాంపు పత్రాలు అమ్ముకుంటూ జీవనం సాగి స్తున్న వెండర్లు చేయని తప్పునకు ఇరుక్కుపోయారు. జిల్లాలోని శైలజ, రవీందర్, కిషన్, రామస్వామి లెసైన్సు పొంది అమ్మకాలు జరుపుతున్నారు. వీరు కొంతకాలంగా అమ్మకాలు సాగిస్తుండడంతో సదరు సీనియర్ అసిస్టెంట్లు పరిచయమయ్యారు. సాధారణంగా వీరు చలాన్ తీసి స్టాంపులు కొనుగోలు చేయాలి. కానీ సదరు సీనియర్ అసిస్టెంట్లను నమ్మి డబ్బులు వారికిచ్చి కొనుగోలు చేశారు. వారు చలాన్ తీయకుండా స్టాంపు పత్రాలు వీరికి అందజేశారు. విచారణలో ఈ విషయం వెలుగుచూడడంతో ఇప్పుడు వెండర్లు పోలీస్‌స్టేషన్, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.
డబ్బులు తిరిగి చెల్లించిన అధికారులు
ఈ కుంభకోణం బయటకు రావడంతో సదరు అధికారులు డబ్బులు తిరిగి చెల్లించారు. స్టాం పు వెండర్ల నుంచి డబ్బులు రికవరీ చేసినట్లు చూపించారు. అయితే తమను అన్యాయంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని వెం డర్లు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశా రు. తప్పు చేయనిదే ఇద్దరు అధికారులు డబ్బులు ఎందుకు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు.
జిల్లా రిజిస్ట్రార్‌కు తెలియదా?
సాధారణంగా జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో ఫ్రాంకింగ్ మిషన్‌లో స్టాంపులు లోడింగ్ చేయా ల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన చాలన్లు చెల్లించారో లేదో ఆయన పరిశీలించాలి. అయితే సీనియర్ అసిస్టెంట్లను రిజిస్ట్రార్ నమ్మడంతోనే ఇంత పెద్ద కుంభకోణం జరిగినట్లు చర్చ సాగుతోంది.