ఇంటికి ఐదుగురికి ‘దివ్య దర్శనం’
ఉచిత తిరుమల యాత్ర విధి విధానాలను ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ పేదలను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్లడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ కొత్తగా ప్రవేశపెట్టదలిచిన దివ్యదర్శనం పథకం విధివిధానాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో ఇంటి నుంచి గరిష్టంగా ఐదుగురి అవకాశం కల్పిస్తారు. మూడేళ్ల లోపు పిల్లలను అదనంగా తీసుకెళ్లవచ్చు.
హిందుమతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారినే ఈ పథకంలో 90 శాతం లబ్దిదారులుగా ఎంపిక చేస్తారు. అగ్ర కులాల్లో తెల్ల కార్డులున్న వారికే ఈ పథకం వర్తిస్తుంది. 70 ఏళ్ల లోపు వయసు ఉన్న వారినే ఈ పథకం వరిస్తుంది. ప్రతి జిల్లా నుంచి విడతల వారీగా ఏడాదికి పది వేల మందికి ఉచిత తిరుమల దర్శనం కల్పిస్తారు. ఉచిత యాత్ర సమయంలో లబ్ధిదారులకు ప్రమాద బీమా కల్పించడానికి దేవాదాయ కమిషనర్ చర్యలు చేపడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.