పసిడి పెరిగినా.. పడింది!
• 40 డాలర్లు పెరిగినా... 80 డాలర్ల నష్టం...
• ఫడ్ రేటు భయాలు; డాలర్ బలోపేతం ఫలితం
న్యూయార్క్, ముంబై: అంచనాలకు భిన్నంగా గడచిన వారం పసిడి తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయ సంకేతాలతో బుధవారం ఒక్కసారిగా ఆసియా ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో భారీగా ఔన్సకు (31.1 గ్రాములు) 40 డాలర్లు ఎగసి, 1,338 డాలర్లకు పెరిగినప్పటికీ, తర్వాత అక్కడ నిలవలేకపోయింది. క్రమంగా తిరిగి 1,300 డాలర్లకు చేరింది. తరువాత అదే రోజు అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్ నెమైక్స్‌లో పసిడి ధర 1,280 డాలర్లకు పడిపోయింది.
తదుపరి మూడు రోజుల్లో క్రమంగా 1,224 డాలర్లకు దిగివచ్చింది. మార్కెట్ పండితులు ఊహించినదానికన్నా భిన్నంగా అమెరికా ఈక్విటీ మార్కెట్లు బలపడటం, డాలర్ బలోపేతం, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.50 శాతం) మరింత పెంచవచ్చన్న అంచనాలు పసిడిని నష్టాలవైపు పరుగులు తీయించాయి. సమీపకాలంలో పడిసి ఇదే తీరులో కొనసాగే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అనుసరించే విధానాల్లో స్పష్టత, ఫెడ్ ఫండ్ రేటు అనిశ్చితి పసిడి ధరపై ప్రతికూలత చూపే అవకాశం ఉందన్నది విశ్లేషణ. మొత్తంమీద వారం వారీగా పసిడి 80 డాలర్లు పడిపోరుు 1,224 డాలర్ల వద్ద ముగిసింది.
దేశంలో ఇలా...
ముంబైలో స్పాట్ బులియన్ మార్కెట్‌ను చూస్తే... బుధవారం అంతర్జాతీయ ధోరణి సుస్పష్టంగా కనిపించింది. ఆ రోజు రూ.31,150 దాటిపోరుుంది. తర్వాత క్రమంగా పడిపోరుు చివరకు వారం వారీగా చూస్తే... 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ.295 తగ్గి, రూ.30,515 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర సైతం ఇంతే స్థారుులో తగ్గి రూ.30,365 వద్ద ముగిసింది. అయితే పెళ్లిళ్ల సీజన్, పెద్ద నోట్ల రద్దుతో పసిడివైపు నల్లధన కుబేరుల చూపు వంటి అంశాలతో సమీప కాలంలో దేశీయంగా కొంత మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఇక వెండి కేజీ ధర రూ.1,385 పెరిగి రూ.45,420కి చేరింది. పెళ్లిళ్ల సీజన్, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ వెండి ధర పెరుగుదలకు కలిసివచ్చిందని నిపుణులు చెబుతున్నారు.