డొనేషన్ల పేరిట మోసం..
హూస్టన్: హరికేన్ హార్వీ ధాటికి అమెరికాలోని హూస్టన్ నగరం చిగురుటాకులా వణుకుతుండగా మరో వైపు దుండగలు డొనేషన్ల పేరిట రెచ్చిపోతున్నారు. వరదల్లో చిక్కుకోని నిరాశ్రయులైన వారికి అండగా అనేక మంది డొనేషన్లు ఇస్తుండగా వీరినే ఆసరాగా చేసుకుంటున్నారు. అయితే డొనేషన్లు ఇచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని జస్టిస్ డిపార్ట్మెంట్ నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ ఫ్రాడ్ డైరెక్టర్ వాల్ట్ గ్రీన్ హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడల్లా సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఫేక్ యూఆర్ఎల్లతో సైబర్ నేరగాళ్లు డొనేషన్ ఇచ్చేవారి నుంచి డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది జాతీయ వాతావరణ శాఖ ఆ ఏట విడుదల చేసే తుఫాను పేర్ల వివరాలను తెలుసుకొని వాటిపై ఆన్లైన్ డొమైన్స్( ప్రభుత్వానికి చెందినది) రిజిస్టర్ చేసుకుంటున్నారని వాల్ట్ గ్రీన్ పేర్కొన్నారు. కొందరు డొమైన్స్ ద్వారా కాకుండా వ్యక్తిగత ఈ మెయిల్ ద్వారా డబ్బులు అడుగుతారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాల్ట్ గ్రీన్ సూచించారు.
విపరీతంగా వర్షం కురుస్తుండడంతో ప్రభుత్వం ఇప్పటికే అక్కడ కర్ఫ్యూ విధించింది. లూటీలు, దొంగతనాలు, ఇతర నేరాలను అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించినట్లు హూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ పేర్కొన్న విషయం తెలిసిందే. వరదలో చిక్కుకున్నవారికి సహాయం చేసేందుకు వెళ్లే బృందాలు, వ్యక్తులకు మినహాయింపు ఇచ్చారు.