పికాసో ఉంగరం విలువ ఎంతో తెలుసా..
లండన్: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకారుడు పాబ్లో పికాసో తన స్ఫూర్తిదాత, ప్రేయసి, పెయింటర్, కవయిత్రి డోరా మార్కు ఆమె చిత్తరువుతో స్వయంగా చేసి ఇచ్చిన ఉంగరం వేలానికి వచ్చింది. మీరా ఎస్టేట్‌తో పాటు పికాసో ఉంగరాన్ని ఈ నెల 21న వేలం వేయనున్నట్లు సోత్‌బై వేలం సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ ఒక్క ఉంగరానికే ఐదు కోట్ల రూపాయలు వేలం పలుకుతుందని వారు అంచనా వేస్తున్నారు.
1930లో డోరా మార్ ఓ రూబీ ఉంగరాన్ని ధరించడం చూసి పికాసోకు కోపం వచ్చింది. రూబీ కోసం పెయింటింగ్‌ను అమ్మేశావా..? అంటూ పికాసో ప్రశ్నించడం ఆమెకు కోపం తెప్పించింది. వెంటనే ఆమె తన చేతికున్న ఉంగరాన్ని తీసి పక్కనే ఉన్న నదిలో పడేసింది. తప్పు చేశాననుకున్న పికాసో ఆమె చిత్తరువు ఉండేలా ఓ కళాత్మకమైన ఉంగరాన్ని తయారుచేసి ఆమెకు బహూకరించారు. ఆ ఉంగరం ఆమె చనిపోయే వరకు (1977) ఆమె వేలికే ఉంది. పికాసో అప్పటి సమకాలీన ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఈ ఉంగరాన్ని తయారు చేశారని సోత్‌బై వేలం సంస్థ నిర్వాహకులు అంటున్నారు.