ముదిరిన తోటల్లో ఆహార భద్రత సాధ్యమేనా?
‘అర ఎకరంలో ఒక కుటుంబానికి కావలసిన అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పప్పులు, నూనెగింజలు, ధాన్యాలు అన్నపూర్ణ పంటల పద్ధతి ద్వారా పండించుకోవచ్చని ‘సాక్షి-సాగుబడి’లో ప్రచురితమవుతున్న వ్యాసాల ద్వారా మాకు భరోసా కలిగింది. కానీ, మామిడి వంటి పండ్ల మొక్కలు ఏటేటా పెరుగుతున్న కొలదీ కొమ్మలు విస్తరించి మట్టి పరుపులన్నిటికీ నీడ వ్యాపిస్తుంది. దీని వలన అప్పటి వరకు మట్టి పరుపుల్లో సాగవుతున్న కూరగాయల నుంచి, ఇతర పంటల నుంచి వస్తున్న దిగుబడులు తగ్గి, ఆ మేరకు ఫలసాయం.. ఆదాయం తగ్గుతుంది. అప్పుడు కుటుంబ ఆహార భద్రత ఎలా సాధ్యపడుతుంది? వందలాది మంది రైతు సోదరులు, సోదరీమణులు ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రశ్నలో చాలా వాస్తవముంది. అయితే, పంటలకు కావలసిన సూర్యరశ్మిని బట్టి, పండ్ల చెట్లకు కత్తిరింపు పద్ధతులను అనుసరిస్తూ సాగు చేయడం వలన ఇది వరకు పండిస్తున్న పంటలను కొనసాగిస్తూనే పండ్ల మొక్కల నుంచి కూడా అధిక దిగుబడులను సాధించవచ్చు. పండ్ల చెట్ల నీడ విస్తరించడం వలన అధిక సూర్యరశ్మి అవసరమయ్యే కూరగాయల దిగుబడి ఏటేటా తగ్గుతూ వస్తూంటుంది. అందు వలన చెట్ల కింద పెరిగే పసుపు, అల్లం, చేమదుంపలను సాగు చేసుకోవాలి. అయితే, వీటి పంట కాలం 6 నెలల నుంచి 9 నెలల దీర్ఘకాలం ఉండడం వలన కూరగాయల నుంచి వచ్చినంత ఆదాయం వీటి ద్వారా రాదు.
కానీ, మొదటి సంవత్సరంలో 9 అడుగుల దూరంలో వేసుకున్న అరటి, బొప్పాయి వంటి పండ్ల మొక్కల నుంచి అదనపు ఆదాయం రావడం మొదలవుతుంది. రెండు, మూడో సంవత్సరాల నుంచి 18 అడుగుల దూరంలో వేసుకున్న జామ, సపోటా, బత్తాయి, నిమ్మ చెట్ల నుంచి కూడా ఫలసాయం.. ఆదాయం రావడం మొదలవుతుంది. 4-5 సంవత్సరాల వయసు వచ్చే సరికి ప్రధాన పండ్ల జాతికి చెందిన మామిడి చెట్ల నుంచి ఫలసాయం.. ఆదాయం రావడం మొదలవుతుంది. ఇది కూరగాయల పంటల నుంచి తగ్గిన ఫలసాయం.. ఆదాయం కంటే ఎక్కువే.
- డి. పారినాయుడు (9440164289),
అన్నపూర్ణ ప్రకృతి వ్యవసాయ పంటల నమూనా రూపశిల్పి