రోబోటిక్స్ విప్లవం ముంగిట్లో మనం!
సాక్షి, హైదరాబాద్: రోబోటిక్స్ రంగంలో పెను విప్లవానికి రంగం సిద్ధమైందని, త్వరలోనే అసాధ్యాలను సుసాధ్యం చేయగల రోబోలు అందుబాటులోకి రానున్నాయని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.అయనా హోవర్డ్ తెలిపారు. రోబోల విషయంలో ఇప్పటివరకూ జరిగిన సాంకేతిక అభివృద్ధి ఒక ఎత్తై రానున్న పదిహేనేళ్లలో జరగబోయేది మరో ఎత్తని ఆమె అన్నారు. ఇక్కడి విద్యారణ్య పాఠశాలలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో హోవర్డ్ ప్రసంగించారు.
రోబోల రాకతో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. పేద వారికీ అద్భుత ప్రయోజనాలు ఒనగూరే అవకాశముందన్నారు. రోబోలకు మనిషిని పోలిన చైతన్యం అందిస్తే కొన్ని చిక్కులు వచ్చే అవకాశముందని స్పష్టం చేశారు. అతిపిన్న వయస్సులోనే ప్రపంచంలోనే మేటి రోబో శాస్త్రవేత్తగా ఎదిగిన డాక్టర్ అయానా హోవర్డ్ ‘హ్యూమనైజ్డ్ ఇంటెలిజెన్స్’పై విసృ్తత పరిశోధనలు చేస్తున్నారు. ‘మంథన్’ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు అజయ్గాంధీతోపాటు అమెరికా దౌత్య కార్యాలయ పబ్లిక్ ఎఫైర్స్ ఆఫీసర్ ఏప్రిల్ వేల్స్ తదితరులు పాల్గొన్నారు.