డాక్టర్ కులశేఖర్ నిరుపేదల దైవం..
- ఉచితంగా వైద్యం..
- సగం ధరకే మందులు
- సేవకు సలాం అంటున్న ప్రజలు
వైద్యం.. ప్రస్తుత కాలంలో అత్యంత ఖరీదైన అంశం. జలుబుకు కూడా వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు కొందరు వైద్యులు. ఇక స్కానింగ్ వంటి అత్యవసర సేవలకైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అలాంటిది రోజువారి కూలీలు, నిరుపేదలు వైద్యం చేయించుకోవాలంటే సాధ్యం కాదు. ఇలాంటివారు స్తోమత లేక నాటువైద్యాన్ని ఆశ్రయిస్తారు, లేదా చిట్కా వైద్యంతో సరిపెట్టుకుంటున్నారు. లేదంటే దేవుడిపై భారం వేస్తారు. ఇలాంటివారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ జి.ఎస్.కులశేఖర్. మరోవైపు తక్కుత ధరకు మందులు సైతం ఇస్తున్నారు.
నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప ప్రాంతం.. బతుకుదెరువు కోసం వలస వచ్చిన కూలీల నివాసం. ఇక్కడివారికి రోగం వస్తే మందుల దుకాణాన్ని నమ్ముకుంటారు. లేదంటే ఏ ఆర్ఎంపీ వద్దకో వెళతారు. మందులు, కమీషన్ కోసం రాసే టెస్ట్‌లు వారిని బెంబేలెత్తిస్తాయి. అయినా రోగం తగ్గుతుందనే నమ్మకం మాత్రం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు డా. కులశేఖర్. పగలంతా ఈఎస్ఐలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పనిచేసే ఈయన ఈ పేద ప్రజలకు ఆపద్భాంధవుడు. ఈయన ‘పీపుల్స్ హెల్త్ ఇనిషియేటివ్’ పేరుతో ఆరోగ్య పథకాన్ని రూపొందించారు. తెల్లకార్డు ఉన్నవారు రూ. 100 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే మూడు నెలల పాటు ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. ఇలా వచ్చిన డబ్బుతో నిధి ఏర్పాటు చేసి మందులపై 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ‘వేరే చోటికి వెళ్లిన ప్రతిసారి 100 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇక్కడ మాత్రం ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. తక్కువ ధరకు మందులు ఇస్తున్నారు. బాగా చూస్తారు. మా పేదోళ్లకి ఇంతకంటే ఇంకేం కావాలి’ అంటోంది స్థానిక మహిళలు చంద్రావతి, లక్ష్మి.
అంబులెన్స్ సేవలు కూడా..
‘చిన్న పిల్లలకు జ్వరం వస్తే కనీసం ఆరు వందలు ఖర్చు పెట్టాలి. ఇది పేదలకు మోయలేని భారమే. ఆర్ఎంపీలు ఇష్టమొచ్చిన విధంగా ఫీజులు వసూలు చేయడం, సరైన వైద్యం అందించకపోవడం గమనించా. ఇలా కాకుండా ప్రజలందరికి తక్కువ ధరలో క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ శ్రేయా ఫౌండేషన్‌తో కలిసి ఈ క్లినిక్‌ని ఏర్పాటు చేశా. డాక్టర్ వృత్తి నియమాల ప్రకారం పబ్లిసిటీ చేయరాదు. గతంలో ఇక్కడికి వచ్చిన వారు వేరేవారికి చెబుతున్నారు. రెగ్యులర్ విధులు ముగిశాక ఇక్కడ సేవలు అందిస్తున్నా. మాకు ఎలాంటి ఫండింగ్ లేదు. సభ్యత్వం కోసం పేషెంట్లు ఇచ్చిన డబ్బులతోనే తక్కువ ధరకు మందులు అందిస్తున్నాం. మరికొంత డబ్బు జమైతే అంబులెన్స్ సేవలు కూడా ఇస్తా’.. అని చెప్పారు డాక్టర్ కులశేఖర్. ఇలాంటి వారికి మరికొంత మంది వైద్యులు చేయి కలిపితే నిరుపేదల బతుకులు బాగుపడడం ఖాయమే.