రోగాల‘పాలు’!
=పడమటి మండలాల్లో యథేచ్ఛగా కల్తీపాల విక్రయాలు
=పట్టించుకోని ఫుడ్ ఇన్స్పెక్టర్లు
జిల్లాలోని పడమటి మండలాల్లో కల్తీపాల విక్రయాల జోరు పెచ్చుమీరుతోంది. కిలో పాల పొడితో పది లీటర్ల కల్తీ పాలు తయారుచేసి వినియోగదారులకు అంటగడుతున్నారు. ఫలితంగా వ్యాధులు ప్రబలుతాయేమోనని స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. కల్తీ పాల వ్యాపారాన్ని అరికట్టాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
మదనపల్లె/తంబళ్లపల్లె, న్యూస్‌లైన్ : పడమటి మండలాల్లో ఇటీవల వరుస కరువుల కారణంగా పాడి సంపద తగ్గిపోయింది. అదే స్థాయిలో పాల దిగుబడీ పడిపోయింది. ఇదే అదునుగా కొందరు పాల ఏజెంట్లు కృత్రిమ పాల తయారీకి పూనుకున్నారు. పలు ప్రైవేటు డెయిరీల మేనేజర్లు, సిబ్బంది, సూపర్వైజర్ల అండతో ఈ వ్యాపారాన్ని సులువగా కానిచ్చేస్తున్నారు.
బెంగళూరు నుంచి పాల పౌడర్ ప్యాకెట్ల దిగుమతి
పాలపౌడర్ ప్యాకెట్లు బెంగళూరు నుంచి గుర్రంకొండకు చెందిన ఓ వ్యాపారి గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసుకుంటున్నాడు. ఆ వ్యాపారి పాలపొడి పొట్లాలను పడమటి మండలాలకు చేరవేస్తూ కంటపడితే ముడుపులిచ్చి సర్దిపెడుతున్నాడు. దీంతో ఈ అక్రమ రవాణా చాపకింద నీరులా విస్తరిస్తోంది. పదార్థాల నాణ్యతను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఓ బస్తాలో 25 ప్యాకెట్లు ఉంటాయి. ఒక్కో ప్యాకెట్ రూ.64 వరకు విక్రయిస్తున్నారు.
పాల తయారీ ఇలా
పాలపౌడర్ చూడ్డానికి తెలుపురంగులో ఉంటుంది. ఏ మాత్రం తేమ తగిలినా బంకగా మారుతుంది. పది లీటర్ల నీటిలో ఒక కిలో పౌడర్వేసి చేతితో బాగా కలియతిప్పుతారు. చూడడానికి పాలులాగా కనబడుతాయి. రుచి ఉండదు. పెరుగు చేద్దామన్నా పనికిరాదు. వీటిని మామూలు పాలలో కల్తీ చేస్తేనే వినియోగానికి పనికివస్తాయి. తంబళ్లపల్లె మండలంలోనే రోజుకు 25 క్యాన్ల (వెయ్యి లీటర్లు) కృత్రిమ పాలు వివిధ డెయిరీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ పౌడర్ కలపడం వల్ల వెన్న శాతం 26 డిగ్రీలు వస్తుంది. దీంతో డెయిరీలలో లీటరు పాలకు రూ.23 ధర లభిస్తోంది. పూటకు ఒక పాల ప్యాకెట్ కలిపి పాలు సరఫరా చేస్తే 15 రోజులకు రూ.5వేల వరకు సంపాదించవచ్చు. ఇలా ఏడాదికి రూ.6 లక్షల వరకు ఏజెంట్లు ఆదాచేస్తున్నట్టు సమాచారం.
డెయిరీలకూ నష్టమే
కృత్రిమ పాల వ్యాపారంతో ప్రయివేటు డెయిరీలూ నష్టపోతున్నట్టు తెలుస్తోంది. డెయిరీలకు వచ్చిన పాలలో వెన్న తీసిన అనంతరం పాల స్వచ్ఛతను పెంచడానికి నాణ్యమైన మిల్క్ పౌడర్ కలిపేవారు. ఇప్పుడు ఈ కృత్రిమ పాల తంతుతో పాలలో వెన్నె అంతంతమాత్రంగానే వస్తోంది. దీంతో డెయిరీలు నష్టపోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ డెయిరీలో పనిచేసే ఓ అధికారి మాట్లాడుతూ ఎల్ఆర్ (పాల స్వచ్ఛత) పెరిగేందుకు ఇలాంటి పౌడర్‌ను వాడుతారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన నాణ్యమైన పౌడర్లు టీ, కాఫీలకు మాత్రమే వాడవచ్చు. నాణ్యత లేని పౌడర్లు వాడితే అనర్థాలు తప్పవని హెచ్చరించారు.
కృత్రిమ పాలతో రోగాలు తథ్యం
కృత్రిమ పాలు తాగడం వల్ల మనిషిలోని ప్రతి అవయం మీద దాని ప్రభావం పడుతుంది. చిన్నపిల్లలు తాగడం వల్ల వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
- డాక్టర్ సుబ్బారెడ్డి, చిన్నపిల్లల వైద్యులు,
మదనపల్లె