అక్టోబర్ 3న ఓటరు ముసాయిదా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబర్ 3న ప్రచురించాలని కలెక్టర్ బి.శ్రీధర్ ఈఆర్ఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఓటరు నమోదుపై ఈఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉంచిన మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలోని ఓటరు నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 45,060 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బూత్‌స్థాయి అధికారులు తమ పరిధిలో ఓటరు నమోదు ప్రక్రియతోపాటు వలస వెళ్లిన , మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించి జాబితా నుంచి తొలగించాలని ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ దరఖాస్తులను పెండింగ్‌లో ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్లలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సౌకర్యంలేని పోలింగ్ స్టేషన్ల జాబితాను తయారుచేసి వాటికి వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేయండి : కలెక్టర్
ఘట్కేసర్, ఎన్ఎఫ్సీ నగర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బి.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఈ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ రెండు పంచాయతీల ఎన్నికలకు మల్కాజ్‌గిరీ ఆర్డీఓ ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. మొత్తం 55 పోలింగ్ స్టేషన్లు, 19,227 మంది ఓటర్లున్నారని జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు.