వారెవ్వా ఆయుషి ! సర్దుకుపోలేదు.. సమస్యకు పరిష్కారం చూపింది
నలుగురితో నారాయణ గుంపులో గోవిందా అనుకుంటూ సమస్యలతో సర్దుకుపోవడం అందరూ చేసే పని. కానీ ఆ మహిళా అలా చేయలేదు. సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఊరూరా తిరుగుతూ టేపుతో కొలతలు తీసుకుంది.. ఆఫీసులో చీపురు పట్టి ఊడ్చింది.. చివరకు అనుకున్నది సాధించింది. దేశ వ్యాప్తంగా లక్షల మంది మహిళలు ఏళ్ల తరబడి సర్దుకుపోతున్న సమస్యలకు పరిష్కారం చూపింది.
ఒకప్పుడు ఇళ్లకే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రోడ్డు పక్కన కూరగాయల షాపు మొదలుపెడితే కార్పొరేట్ ఆఫీసులో పెద్ద పనుల వరకు చక్కబెడుతున్నారు. కిక్కిరిసిన సిటీ బస్సులతో పాటు ఫ్లైట్లలో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో కూడా వెళ్తున్నారు. ఇలా వర్క్‌కి వెళ్తున్న మహిళలు బయట ఎదుక్కొంటున్న సమస్యకి పరిష్కారంగా ఓ స్టార్టప్ ప్రాణం పోసుకుంది.
కంఫర్ట్ ఎక్కడ ?
ఆయుషి గుడ్వాని ఢిల్లీలో సంపన్న కుటుంబానికి చెందిన యువతి. ఆర్థికంగా లోటు లేకపోయినా కట్టుబొట్టు విషయంలో సంప్రదాయం పాటించాలని కోరుకునే కుటుంబం నుంచి వచ్చింది. బీటెక్ పూర్తి చేసిన వెంటనే ఐఐఎం కలకత్తాలో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ వెంటనే 2008లో మెక్‌కెన్సీ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం సంపాదించింది. సంప్రదాయ చుడీదార్ లేదా చీరకట్టులో ఆఫీస్‌కి వెళితే పెన్ను, ఫోను, పర్సు, ఐడీ కార్డు, ఫైల్స్ ఇలా అన్ని చేతితోనే పట్టుకుని పని చేయాల్సి వచ్చేది. అయితే ఫారిన్ టూర్లకు వెళ్లేప్పుడు అక్కడి దుస్తులే ప్రిఫర్ చేసేది.
స్టార్టప్‌కి బీజం
ఫారిన్ టూర్లలో ధరించే వర్క్ కల్చర్‌కి తగ్గట్టుగా ఉండేవి. అయితే ఆ బట్టలు ఇండియాలో ప్రతీ రోజు ధరించడం ఇబ్బందిగానే ఉంటుంది. విదేశాల్లో లభించే వర్క్ వేర్ అంతా అక్కడి కల్చర్, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందుతాయి. ఇక్కడి వేడి వాతావరణ పరిస్థితులకు లోకల్ కల్చర్‌కి అవి పూర్తిగా నప్పవు. కానీ ఇండియాలో ఆఫీసులకు వెళ్లేందుకు మహిళలకు వర్క్ వేర్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇంట్లో ధరించే చీరకట్టు, చుడీదార్ వంటి సంప్రదాయ దుస్తులు తప్ప సరైన ప్రత్యామ్నాయం అందుబాటులో లేవు. 120 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ఆటో డ్రైవర్ల నుంచి కార్పొరేట్ కంపెనీ సీఈఓలుగా లక్షల మంది మహిళలు వివిధ పనుల్లో ఉంటే వారి కోసం ప్రత్యేకంగా వర్క్ వేర్ లేకపోవడం పెద్ద లోటని ఆయుషి గుడ్వానీకి గుర్తించింది.
ఉద్యోగానికి రాం రాం
అసలే ఐఐఎం స్టూడెంట్ దానికి బ్యాక్‌గ్రౌండ్ బీటెక్ చదివింది ఆయుషి. ఓ సమస్య దాని వెంటే ఓ అవకాశం కనిపిస్తుంటే ఊరుకుంటుందా? వెంటనే తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నా వినకుండా చేస్తున్న బంగారంలాంటి ఉద్యోగానికి 2015లో రాజీనామా చేసింది. చేతిలో ఉన్న సేవింగ్ మనీతో వర్క్ వేర్ మీద మనసు లగ్నం చేసింది.
టేపు చేతబట్టి
విదేశాల్లో ఒకే భాష ఒకే తరహా మనుషులు ఉంటారు. కానీ భారత్ పరిస్థితి దానికి భిన్నం, విభిన్న వాతావరణ పరిస్థితులు, భిన్న శరీర ఆకృతులు కలిసిన మనుషులు ఇక్కడున్నారు. వీరి తగ్గట్టుగా బట్టలను డిజైన్ చేయడం అతి పెద్ద సవాల్‌గా మారింది ఆయుషికి. కానీ పట్టు వదల్లేదు. ధైర్యం కోల్పోలేదు. ఒక్కతే బ్యాగులో చిన్న సైజు టేపు పెట్టుకుని ఆఫీసులు, అపార్ట్మెంట్లు, వీధుల వెంట తిరిగింది. వేయి మందికి పైగా మహిళల దగ్గర నుంచి కొలతలు తీసుకుంది. ఇలా ఏడాది పాటు శ్రమించి వాటి సాయంతో టెక్నాలజీ సాయంతో ఓ అల్గారిథం తయారు చేసింది. దాని ఆధారంగా మూడు భిన్న సైజుల్లో డ్రెస్సులు రూపొందిస్తే అవి ఇండియన్లకు నప్పుతాయనే నమ్మకానికి వచ్చింది.
ఆన్‌లైన్‌తో మొదలు
ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తూ సేవ్ చేసిన మనీ అంతా ఏడాది పాటు రీసెర్చ్‌కే అయిపోయింది. ఉన్న కొద్ది పాటు డబ్బులతో వర్క్ వేర్ తయారు చేసింది. వాటిని ఫాబుల్ స్ట్రీట్ పేరుతో ఆన్లైన్లో 2016లో అమ్మకానికి పెట్టింది. కొత్త బ్రాండ్ ప్రచారం చేసేందుకు డబ్బులు చాలక ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా వంటి షోషల్ మీడియా ఫ్టాట్ఫామ్స్నే ఆమె నమ్ముకుంది. అప్పటికే ఆమెకు ఉన్న పరిచయాలతో తన స్నేహితులు, పరిచయస్తులకు తన డిజైన్స్ చూపించింది.
అక్కున చేర్చుకున్నారు
ఆఫీస్‌లో వర్క్ చేసుకునేందుకు అనువుగా ఉంటూ ఫ్యాషనబుల్ ఇక్కడి సెంటిమెంట్స్‌ని హర్ట్ చేయని ఫాబుల్ స్ట్రీట్ స్టైల్‌ను వర్కింగ్ విమెన్ అక్కున చేర్చుకున్నారు. ఏళ్ల తరబడి ఇంటి వాతావరణానికి అనువైన సంప్రదాయ దుస్తుల్లోనే ఇంటి బయట నెట్టుకొస్తున్న వర్కింగ్ క్లాస్ విమెన్‌కి ఆయుషి చేసిన డిజైన్స్ వరంలా తోచాయి. స్టైల్, కంఫర్ట్, క్వాలిటీ అందించే ఈ బట్టలను ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆదరించారు.
హ్యాండ్స్ ఫ్రీ
బయట పనుల్లో ఉండే మగవారికి అవసరాలకు తగ్గట్టుగా షర్ట్, ప్యాంట్స్లకు జేబులు ఉంటాయి. కానీ మహిళలకు ఆ సౌకర్యం లేదు. ఏమైనా చేతిలో పట్టుకోవాల్సిందే లేదా బ్యాగును వెంట తెచ్చుకోవాల్సిందే. ఈ ఇబ్బందులు తొలగించేందుకు రూమీ పాకెట్స్‌ను పరిచయం చేసింది. ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ విమెన్ వర్కింగ్ వేర్ ఫ్యాషన్‌కి కొత్త బాటలు వేసింది.
రెండేళ్లకే
ఫ్యాబుల్స్ట్రీట్ మార్కెట్లో దూసుకుపోతున్న తీరుతో ఒక్కసారిగా వెంచర్ క్యాపిటలిస్టులు ఆయుషిని సంప్రదించారు. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన స్టార్టప్‌లో మూడేళ్లకే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో కంపెనీ మరింతగా విస్తరించి వర్కింగ్ వేర్‌తో పాటు యాక్సెసరీస్ సైతం పరిచయం చేసింది.
అన్నీ తానై
ఎంఎన్సీ కంపెనీలో ఏడేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ హోదాలో అన్ని సౌకర్యాలను వదులుకుని తాను పడ్డ ఇబ్బందులు, తాను చూసిన అవకాశాల కోసం పట్టుదలగా పోరాడింది ఆయుషి గుడ్వానీ. తొలిసారిగా ఫాబుల్ స్ట్రీట్ స్థాపించినప్పుడు ఆఫీసు ఊడ్చే పని దగ్గర నుంచి వాటర్ క్యాన్ మార్చే వరకు అన్నీ పనులు ఒక్కతే చేసుకుంది. ఒంటరిగా స్టార్టప్ ప్రారంభించింది. ఇప్పుడు వందల మందికి ఉపాధి ఇవ్వడమే కాదు లక్షల మంది మహిళలకు వర్కింగ్ ప్లేస్‌లో ధరించేందుకు కంఫర్ట్ ఇచ్చే ఫ్యాషనబుల్ డ్రెస్‌లను అందుబాటులోకి తెచ్చింది.
సోషల్ ఇంజనీరింగ్
నిజానికి ఫాబుల్ స్ట్రీట్ బ్రాండ్ ప్రీమియం వర్కింగ్ విమెన్ వేర్ కేటగిరిలో దుస్తులను విక్రయిస్తోంది. ఇండియాలో వివిధ పనుల్లో ఉన్న చాలా మంది మహిళలు ఈ దుస్తులు కొనలేకపోవచ్చు. కానీ ఆయుషి పరిచయం చేసిన చుడిదార్ ప్యాకెట్స్, స్ట్రెచ్ , వివిధ డిజైన్ల కాపీలు ఇప్పుడు సాధారణ మార్కెట్లో కూడా లభిస్తున్నాయి. చాలా మంది వర్కింగ్విమెన్ వీటిని ఉపయోగిస్తున్నారు. బిటెక్ చదివిన ఆయుషీ తనకు తెలియకుండానే చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఎక్సపెరిమెంట్ సక్సెస్ అయ్యింది. ఆమెకు మంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చింది.
- సాక్షి, వెబ్ ప్రత్యేకం
చదవండి: కలిసొచ్చిన కరోనా!.. బిలియనీర్స్ లిస్ట్‌లో రాధాకృష్ణన్ దమానీ