టీవీల ధరలు పెంచుతున్న కంపెనీలు
న్యూఢిల్లీ : ఇన్నిరోజులు డిస్కౌంట్ల వర్షం కురిపించిన డ్యూరబుల్స్ కంపెనీలు ఇక ధరల పెంపుకు రంగంలోకి దిగాయి. టెలివిజన్లు, అప్లియన్స్‌పై కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి రావడంతో టెలివిజన్ రేట్లను పెంచుతున్నట్టు ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ ప్రకటించేసింది. ఈ ధరల పెంపును ప్రకటించిన తొలి కంపెనీ కూడా ఎల్జీనే. ఎల్జీ ఎల్ఈడీ టెలివిజిన్లు నుంచి ఎల్జీ స్మార్ట్ ఎల్ఈడీ సెట్లు, ఎల్జీ యూహెచ్డీ ఎల్ఈడీ సెట్ల వరకు ధరల పెంపును ఎల్జీ చేపడుతోంది. దీంతో పశ్చిమ ప్రాంతంలో డీలర్ ధరలు 1.3 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో పెరిగాయి. ఇక ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో స్వల్పంగా 2 శాతం పెంపుదల కనిపిస్తోంది. ఎల్జీ అనుకున్న మాదిరిగానే ధరల పెంపును చేపట్టిందని విజయ్ సేల్స్ మేనేజింగ్ పార్టనర్ నైలేష్ గుప్తా ధృవీకరించారు. మరో ఎలక్ట్రానిక్ దిగ్గజం పానాసోనిక్ కూడా టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ వంటి వైట్ గూడ్స్ ధరలను త్వరలోనే పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ వారం చివరి కల్లా ఎంత పెంచాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పానాసోనిక్ సేల్స్ అండ్ సర్వీసు డైరెక్టర్ అజయ్ సేథ్ తెలిపారు.
అయితే ప్రస్తుతమున్న రిటైల్ ధరలపై 3-4 శాతం మధ్యలో ప్రభావం పడే అవకాశం కనిపిస్తోందని సంబంధితవర్గాలు చెప్పాయి. అయితే శాంసంగ్ ఇప్పుడే ధరల పెంపును చేపట్టదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టి ప్రకటించడానికి ముందే వైట్ గూడ్స్‌పై 1-2 శాతం వరకు శాంసంగ్ ధరల పెంపు చేపట్టిందని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. సోని సైతం తమ టీవీలపై రేట్లను పెంచే ప్లాన్స్ ఏమీ లేవని అధికారికంగా ప్రకటించింది. ఇప్పట్లో టీవీల ధరలు సమీక్షించే ఉద్దేశ్యమేమీ లేదని సోని ఇండియా సేల్స్ హెడ్ సతీష్ పద్మనాభన్ తెలిపారు. అయితే హెచ్‌పీ, మిగతా కంపెనీలు ధరల పెంపు దిశగా కదులుతున్నాయి. జీఎస్టీకి ముందు పాత స్టాక్‌ను విక్రయించడానికి ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు భారీగా డిస్కౌంట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ డిస్కౌంట్ల పర్వంతో విక్రయాలు కూడా జోరుగా కొనసాగించాయి. కొత్త పన్ను విధానం ఇక అమల్లోకి రావడంతో దానికి అనుగుణంగా కంపెనీలు రేట్ల పెంపును చేపడుతున్నాయి. ప్రస్తుతం కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌పై జీఎస్టీ రేటు 28శాతంగా ఉంది. ఇది ముందస్తు పన్ను రేటు కంటే ఎక్కువ.