Dutch Parliament
-
WFH: మారిన పరిస్థితి.. ఇక ఆ దేశంలో వర్క్ ఫ్రం హోం చట్టబద్ధ హక్కు
హేగ్: కరోనా మహమ్మారి పని సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా మార్చేసింది. సుమారు రెండేళ్లపాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పద్ధతికి అలవాటు పడ్డారు. ఇప్పటికీ కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం నచ్చిన ఉద్యోగులు కొందరు ఆఫీసులకు వెళ్లి పనులు చక్కబెట్టేందుకు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం విధానాన్ని చట్టబద్ధ హక్కుగా మార్చేందుకు నడుం బిగించింది. దీని ప్రకారం..ఉద్యోగులకు తమ యాజమాన్యాలను వర్క్ ఫ్రం హోం డిమాండ్ చేసే హక్కుంటుంది. తిరస్కరించే సంస్థలు అందుకు గల కారణాలను వివరించాల్సి ఉంటుంది. సంబంధిత బిల్లును ఆ దేశ దిగువ సభ ఇటీవల ఆమోదించింది. ఎగువ సభ కూడా ఆమోదిస్తే చట్ట రూపం దాల్చుతుంది. ఇలాంటి అవకాశం కల్పించిన మొట్టమొదటి దేశం నెదర్లాండ్స్ కానుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు ఇంటి నుంచే విధులు నిర్వహించవచ్చంటూ స్కాట్లాండ్ ప్రభుత్వం గత నెలలో ఓ ప్రతిపాదన తీసుకువచ్చింది. బదులుగా వేతనంలో కోత ఉంటుందని మెలికపెట్టడం వివాదాస్పదమైంది. ఆఫీసుకు రావాలంతే..!! ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతుండగా, ఆఫీసులకు రావాలంటూ కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను గట్టిగా కోరుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్..! ఆఫీసుకు రండి, లేదా రాజీనామా చేయండి అంటూ నెల క్రితం ఈయన తన ఉద్యోగులకు అల్టిమేటం ఇచ్చారు. యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కూడా ఇలాగే ఆదేశించి కంగు తిన్నారు. ఉద్యోగమైనా మానేస్తాం గానీ ఆఫీసులకు మాత్రం రాబోమంటూ ఉద్యోగులు తెగేసి చెప్పారట. -
పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం?!
మానవ అభివృద్ధి సూచీలో ఐదో స్థానంలో ఉన్న నెదర్లాండ్ మరో ముందడుగు వేసేలా కనబడుతోంది. పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు 2025 నాటికి పూర్తి స్థాయిలో నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు లేబర్ పార్టీ అక్కడి దిగువసభలో బిల్లును ప్రవేశపెట్టింది. కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే 2025 తర్వాత అమ్మకాలు జరపాలని తమ ప్రతిపాదనలో పేర్కొంది. ట్విడ్ కమెర్(పార్లమెంట్ దిగువ సభ)కు ఎన్నికైన వారిలో మెజారిటీ సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఉన్నారు. ఈ నిర్ణయంతో అప్పటి వరకు ఉన్న పెట్రోల్, డీజిల్ కార్లు రోడ్లపై తిరిగే అవకాశం ఉంటుంది. కానీ, కొత్త పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలు పూర్తిగా ఆపివేస్తారు. డచ్ పార్లమెంట్లో దీనిపై పూర్తి స్తాయిలో చర్చజరిగే అవకాశం ఉంది. ఒక వేళ ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు ఇదొక సానుకూల అంశంగా మారే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంతో పెట్రోల్, డీజిల్ కార్ల ద్వారా వచ్చే కాలుష్యానికి చెక్ పెట్టొచ్చు. నెదర్లాండ్లో మొత్తం 29 శాతం రవాణాకోసం శక్తిని వినియోగిస్తుంటే వీటిలో కేవలం 10 శాతం మాత్రమే పునరుత్పాదక వనరులపై ఆధారపడుతోంది. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రపంచంలోని మిగతా దేశాలకు నెదర్లాండ్ ఆదర్శదేశంగా నిలువనుంది.