నింగికెగిరిన విద్యుత్ విమానం
లండన్: ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యుత్ విమానం తొలిసారిగా నింగికెగిరింది. ప్రయోగాత్మకంగా రూపొందించిన ‘ఈ-ఫ్యాన్’ అనే ఈ చిన్న విమానం ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలోని బోర్డీక్స్ సమీపంలోనున్న విమానాశ్రయం నుంచి తొలి గగనయానానికి బయలుదేరింది. ఎలక్ట్రిక్ విమానాల ద్వారా విమానయాన వ్యయం గణనీయంగా తగ్గుతుందని దీనిని తయారు చేసిన ‘ఎయిర్ బస్’ సంస్థ వెల్లడించింది. దీని ధ్వని కూడా తక్కువేనని, హెయిర్ డ్రయ్యర్ ధ్వని కంటే ఎక్కువేమీ ఉండదని తెలిపింది.
‘ఎయిర్‌బస్’ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం... ఈ విమానం పొడవు 19 అడగులు. 120 లీథియం అయాన్ పాలిమర్ బ్యాటరీల సాయంతో ఇది ప్రయాణిస్తుంది. రీచార్జింగ్ అవసరం లేకుండా ఇది గంటసేపు నిరంతరాయంగా ప్రయాణించే అవకాశం ఉంది. అయితే గత నెల తొలిసారిగా జరిపిన పరీక్షలో దీనిని పది నిమిషాలు మాత్రమే నడిపారు. పెట్రోలుతో ప్రయాణించే సాధారణ విమానాల్లో ప్రయాణించేందుకు గంటకు 55 డాలర్లు ఖర్చవుతుంది. ‘ఈ-ఫ్యాన్’లోనైతే కేవలం 16 డాలర్ల ఖర్చుతోనే గంటసేపు ప్రయాణించవచ్చు.