అప్పట్లోనే షాపింగ్ మాల్..
ఆర్థిక సరళీకరణల పుణ్యమాని షాపింగ్ మాల్స్ మన నగరాల్లో ఎక్కడికక్కడ విస్తరిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే దీపాలంకరణలు, లోపలకు అడుగుపెడుతూనే చల్ల చల్లగా ఎయిర్ కండిషన్డ్ వాతావరణం.. గుండుసూది నుంచి భారీ వస్తు వాహనాదుల వరకు సమన్తం ఒకేచోట దొరుకుతాయి. ఔరా! ఎంతటి ఆధునికత! ఇదంతా అమెరికా వాడి మహిమ అనుకుంటున్నారా..? అయితే తప్పులో కాలేసినట్లే! చరిత్రలో మొట్టమొదటి షాపింగ్ మాల్ క్రీస్తుశకం ఒకటో శతాబ్దిలోనే ఉండేది.
రోమన్ చక్రవర్తి ట్రాజాన్ అప్పట్లోనే రోమ్ నగరంలో బహుళ అంతస్తుల షాపింగ్ మాల్ నిర్మించాడు. అందులో దాదాపు పదిహేనువందల దుకాణాలు ఉండేవి. ఇప్పటి షాపింగ్ మాల్స్‌లో మాదిరిగానే, అందులోనూ తినుబండారాలు, సుగంధ ద్రవ్యాలు, దుస్తులు, అలంకరణ వస్తువులు వంటివన్నీ అమ్మేవారు.