Edir Neechal
-
అనిరుద్ లేటెస్ట్ లవర్
కోలీవుడ్‌లో యువ సంగీత దర్శకుడు అనిరుధ్పైనా, నటి ప్రియా ఆనంద్‌పైనా ఈ మధ్య వదంతుల జోరు పెరిగింది. అయితే ఈ అమ్మడు వీటిని ఎంజాయ్ చేస్తోంది. ఆ మధ్య ఎదిర్‌నీచ్చల్ చిత్రం సందర్భంగా ఆ చిత్ర హీరో శివకార్తికేయన్‌తో చెట్టాపట్టాలంటూ ప్రియా ఆనంద్‌పై వదంతుల మోత మోగింది. ఆ ప్రచారాన్ని అంతగా పట్టించికోని ఈ బ్యూటీపై తాజాగా మరో వదంతి తెరపై కొచ్చింది. యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో ప్రేమాయణం అన్నది ఆ వదంతి. వీరిద్దరూ తరచూ కలుసుకుంటూ గంటల తరబడి ముచ్చటించుకుంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. ప్రియా ఆనంద్‌కు ఎదిర్ నీచ్చల్ సమయంలో అనిరుధ్‌తో పరిచయం, వణక్కం చిత్రం సమయంలో ప్రేమగా మారినట్లు కోలీవుడ్ గుస గుసలాడుతోంది. అనిరుధ్ అంటే ఈ తరం హీరోయిన్లకు యమ క్రేజ్. ఆ మధ్య నటి ఆండ్రియాతో రొమాన్స్ ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేసి కలకలం రేపాయి. దీంతో అనిరుధ్‌తో ప్రేమ వ్యవహారం ఇంతకు ముందు గానీ ఇప్పుడు కానీ లేదని నటి ఆండ్రియ సుస్పష్టంగా వెల్లడించారు కూడా. తాజా వదంతులపై అనిరుధ్ స్పందిస్తూ ప్రియా ఆనంద్ తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని అన్నారు. అయితే ఈ వ్యవహారంపై ప్రియా ఆనంద్ మాత్రం నోరు మెదప లేదు. -
ప్రేమలో గెలవాలంటే...
తొలి చూపులోనే ఆ యువతిపై మనసు పారేసుకుంటాడతను. ఓ శుభముహూర్తాన ‘ఐ లవ్ యు’ కూడా చెప్పేస్తాడు. కానీ, తన మనసు గెల్చుకోవాలంటే ఏదైనా ప్రయోజనాత్మక కార్యం చేయాలని ఆమె ఓ నిబంధన విధిస్తుంది.. మరి.. ఆమె కోరికని నెరవేర్చి, ప్రేమను పొందగలిగాడా? లేదా? అనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘ఎదిర్ నీచల్’. శివకార్తికేయన్, ప్రియా ఆనంద్ జంటగా తమిళ హీరో ధనుష్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘నా లవ్‌స్టోరీ మొదలైంది’ పేరుతో జె. రామాంజనేయులు తెలుగులోకి అనువదించారు. ఆర్.ఎస్. దురై సెంథిల్‌కుమార్ దర్శకుడు. ఈ నెల 29న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ -‘‘జీవితంలో ఆశావహ దృక్పథంతో ఉంటే అన్నీ సాధించగలుగుతామని చెప్పే చిత్రం ఇది. ప్రేమ, వినోదం, సెంటిమెంట్లతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. ధనుష్, నయనతార చేసిన ప్రత్యేక పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. శివకార్తికేయన్, ప్రియా ఆనంద్ అద్భుతంగా నటించారు. అనిరుథ్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తమిళంలోలానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.