గెలుపుతో అన్నాడీఎంకే సంబరాలు
తిరువళ్లూరు: అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలే ఉప ఎన్నికల్లో విజయానికి కారణమని పూందమల్లి ఎమ్మేల్యే ఏలుమలై అన్నారు. తంజావూర్, అరవకురుచ్చి, తిరుప్పరగుండ్రం, పుదుచ్చేరి నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం వెలువడ్డారుు. తంజావూర్, తిరుప్పరకుండ్రం, అరవకురచ్చి మూడు అసెంబ్లీ స్థానాలను అన్నాడీఎంకే భారీ మోజారీటితో గెలుచుకున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు బాణాసంచా కాల్చుతూ సంబరాలు నిర్వహించారు.
తన్నీర్‌కులం వద్ద ఉదయం బాణసంచా కాల్చిన నేతలు స్వీట్లు పంచి పెడుతూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఈకాడులోనూ సంబరాలను యూనియన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పూందమల్లి ఎమ్మెల్యే ఏలుమలై ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఈ విజయంతో మరిన్ని సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేస్తామని ప్రకటించారు. పార్టీ నేతలు మోహనసుందరం, కేశవన్, రాజశేఖర్, సుబ్రమణ్యం, మురగయ్య పాల్గొన్నారు.
అన్నాడీఎంకే విజయంతో కార్యకర్తల సంబరం
వేలూరు: రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో జరిగిన ఉపఎన్నికల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధించడంతో వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో కార్యకర్తలు స్వీట్లు పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలోని తంజావూర్, అరవకుర్చి, తిరుప్పరగుండ్రం నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుపొందారు. దీంతో వేలూరు సమాచార టెక్నాలజీ విభాగం జిల్లా కార్యదర్శి జననీ సతీష్‌కుమార్ అధ్యక్షతన పాత కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు బాణసంచా పేల్చి, కార్యకర్తలకు స్వీట్లు పంచి పెట్టారు.
ఆయనతో పాటు సమాచార విభాగం అధ్యక్షుడు రాజన్, కోశాధికారి నిత్యానందం పాల్గొన్నారు. అదే విధంగా వేలూరు కామరాజర్ విగ్రహం ఎదుట మాజీ జిల్లా కార్యదర్శి మూర్తి ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచి పెట్టారు. ఆయనతో పాటు డివిజన్ కార్యదర్శి అన్వర్ బాషా, యువజన విభాగం జిల్లా కార్యదర్శి డీడీఆర్.రఘు, జిల్లా ప్రతినిధి రాజ, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు.