ఉద్యోగాల జాతరకు చలో యూపీ!
సుదీర్ఘకాలంగా ఉన్న నిషేధాన్ని ఎత్తేయడంతో.. ఉత్తరప్రదేశ్లో ఉద్యోగాల జాతర మొదలైంది. మొత్తం 5 లక్షల ఖాళీలను భర్తీ చేసేందుకు అక్కడి యంత్రాంగం సిద్ధమైపోయింది. అందులో 1.38 లక్షల పోలీసు ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ ఖాళీ భర్తీ నిర్ణయాన్ని ఆమోదించింది. రాష్ట్రంలో మొత్తం 10.45 లక్షల మంది ఉద్యోగులు ఉండాలని, కానీ ఏకంగా 4.97 లక్షల ఖాళీలున్నాయని అధికారులు తెలిపారు.
దీనిపై తీవ్రంగా చర్చించిన తర్వాత.. వివిధ శాఖల్లో ఉన్న 5 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ల్యాబ్ అసిస్టెంట్లు, అధ్యాపకుల ఖాళీలతో పాటు వివిధ పోస్టులను కూడా భర్తీ చేస్తారు. హోం, ప్రాథమిక విద్య, సాంఘిక సంక్షేమం, అటవీశాఖ, పంచాయతీ రాజ్, పర్యాటకం, సాంకేతిక విద్య, మైనారిటీ సంక్షేమం, రెవెన్యూ, సెంకండరీ విద్య లాంటి శాఖల్లో మిగిలిన ఖాళీలున్నాయి.