ఎండ్యురాన్స్ టెక్ లిస్టింగ్ మెరుపులు
37 శాతం లాభంతో ముగిసిన షేర్
న్యూఢిల్లీ: వాహన విడిభాగాలు తయారు చేసే ఎండ్యురాన్స్ టెక్నాలజీస్ షేర్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. బీఎస్ఈలో ఈ షేర్ ఇష్యూ ధర, రూ.472తో పోల్చితే 21 శాతం లాభంతో రూ.570 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 39 శాతం(రూ.655) వరకూ ఎగసిన ఈ షేర్ చివరకు 37 శాతం లాభంతో రూ.648 వద్ద ముగిసింది. బుధవారం మార్కెట్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,111 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 81 లక్షలు, ఎన్ఎస్ఈలో 3 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఈ నెల 5న ప్రారంభమై 7న ముగిసిన ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా ఈ కంపెనీ రూ.1,161కోట్ల నిధులు సమీకరించింది. రూ.467-472 ధర శ్రేణితో వచ్చిన ఈ ఐపీఓ 44 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది.
ఈ ఐపీఓలో భాగంగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ యాక్టిస్ 1.93 కోట్ల షేర్లను, ప్రమోటర్ 53.17 లక్షల షేర్లు.. మొత్తం 2.46 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో జారీ చేశారు. ఈ ఐపీఓకు యాక్సిస్ క్యాపిటల్, సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా సంస్థలు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించాయి. ఈ కంపెనీ ద్వి, త్రి చక్ర వాహనాలకు అవసరమైన విడిభాగాలను తయారు చేస్తోంది. ఇటలీ, జర్మనీల్లో ప్లాంట్లున్నాయి.