కరీంనగర్లో ముగిసిన ఇస్రో ప్రదర్శన
సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో రెండురోజులపాటు నిర్వహించిన ఇస్రో అంతరిక్ష ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. ఇస్రో పితామహుడు, ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త విక్రం సారాబాయి శత జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ఐదు ప్రముఖనగరాల్లో నిర్వహిస్తోంది. ఖగోళ ప్రదర్శన కరీంనగర్ జిల్లాలో రెండురోజులపాటు నిర్వహించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థుల్లో శాస్త్రసాంకేతి క పరిజ్ఞానం పెంపొందించడమే లక్ష్యంగా ప్రదర్శన ఏర్పాట యింది. ఉమ్మడి కరీంనగర్లోపాటు సిద్దిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వేలాదిమంది తరలివచ్చి ప్రదర్శన తిలకించారు. విద్యార్థులకు ఇస్రోశాస్త్రవేత్తలు ప్రతీ విషయం వివరిస్తూ ఖగోళశాస్త్రంపై ఆసక్తి పెంపొందించారు. విద్యార్థులతోపాటు వారి వెంట వచ్చిన ఉపాధ్యాయులు కూడా ఖగోళ పరిశోధనలు, రాకె ట్ ప్రయోగం, కమ్యూనికేషన్, టెక్నికల్ శాటిలైన్ ప్రయో గం, చంద్రయాన్, మంగళ్యాన్, రాకెట్, పీఎస్ఎల్వీ, ఉపగ్రహాల ప్రయోగం, పని తీరు, జీవితకాలం, అంతరిక్షంలో జరిగే ప్రమాదాలు, ఫ్యూయల్ వినియోగం, ప్రయోగంలో పాల్గొనే శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానం, దేశం తరఫున ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాల గురించి వివరించారు.
ఆకట్టుకున్న రాకెట్ ప్రయోగ ప్రదర్శన
ఇస్రోశాస్త్రవేత్తలు విద్యార్థులకోసం తాత్కాలికంగా రూపొందించి ప్రయోగించిన రాకెట్‌లాంచింగ్ సన్నివేశం విద్యార్థులను సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. తక్కువ ఖర్చుతో నిర్మించిన వాటర్రాకెట్ను విద్యార్థులు ఆసక్తిగా గమనించారు. ఒత్తిడి, పైగి ఎగిసే వేగం తదితర అంశాల గురించి విద్యార్థులు వివరించారు. సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. గైడ్లు కూడా విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేశారు.
ఆలోచింపజేసిన చంద్రయాన్–2 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్–2 ప్రయోగాన్ని కళ్లకు కట్టేలా శాస్త్రవేత్తలు ప్రదర్శించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఇస్రో బస్సులో చంద్రయాన్ ప్రయోగం, అది వెళ్లిన దూరం, క్రాష్ ల్యాండ్ అయిన వివరాలు వీడియో రూపంలో ప్రదర్శించడంతోపాటు విద్యార్థులకు ప్రత్యేకంగా వివరించారు. ప్రయోగం తీరు, విఫలం కావడానికి కారణాలు విద్యార్థులను ఆలోచింపజేసింది.
రాకెట్లు, ఉపగ్రహ నమూనాల ప్రదర్శన..
ఇస్రో ప్రదర్శనలో భాగంగా రాకెట్ల నమూనాలు, ఉపగ్రహ నమూనాలు, ఇంధన వినియోగం, భూఆకర్షణ శక్తి, గురు గ్రహ ఆకర్షణ, కక్షలు, ఒక కక్ష నుంచి మరో కక్షలోకి ప్రవేశపెట్టే విధానం, కమ్యూనికేషన్, టెక్నీకల్ ఇన్మర్మేషన్ వినియోగం తదితర అంశాలను శాస్త్రవేత్తలు చిత్రాలు, వీడియోల ద్వారా సందర్శకులకు వివరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, సందర్శకులు ‘సాక్షి’తో అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు.
తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగం..
రాకెట్ ప్రయోగంపై అందరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇళ్లలో లభించే ఖాళీ బాటిళ్లు, గాలి, నీరుతో ప్రయోగించే విధానాన్ని ఇస్రో ప్రదర్శనలో విద్యార్థులకు కళ్లకు కట్టేలా చూపించాం. ప్రతక్ష అనుభవం ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగింది. చాలామంది సందర్శకులు తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. సందేహాలు అడిగి తెలుసుకున్నారు.
– హరీష్‌కుమార్, ఇస్రో గైడ్
శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి
ప్రతీ విద్యార్థిలో శాస్త్రపరిజ్ఞానం ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు అనూహ్య స్పందన వచ్చింది. చాలామంది విద్యార్థులు హాజరై ప్రత్యక్ష అనుభవం పొందారు. సందేహాలు నివృత్తి చేశారు. అనుమానాల గురించి అడిగి తెలుసుకున్నారు. నమూనాలు ప్రత్యక్షంగా పరిశీలించారు.
– పద్మారాణి, ఇస్రో శాస్త్రవేత్త
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపే లక్ష్యం..
విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో దేశంలోని వంద నగరాల్లో ప్రదర్శనకు కార్యాచరణ రూపొందించాం. ఇందులో భాగంగా తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మంలో ప్రదర్శన ఏర్పాటు చేశాం. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. సుమారు 20 వేల మంది రెండురోజులు ప్రదర్శన తిలకించారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకున్నారు.
– రాజశ్రీ, ఇస్రో మేనేజర్
ప్రత్యక్ష అనుభూతి..
ఇస్రో అంతరిక్ష ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శనలో నేను వలంటీర్ గైడ్‌గా వ్యవహరించా. నేను ప్రయోగాలు, ఉపగ్రహాలు రాకెట్ల గురించి తెలుసుకుంటూ సందర్శనకు వచ్చిన విద్యార్థులకు వివరించడం ప్రత్యక్ష అనుభూతి కలిగించింది. చాలా వరకు నేను నేర్చుకోవడంతోపాటు విద్యార్థులకు తెలియజేశా.
– పల్లవి, గైడ్