రోడ్డు పక్కన శవం.. ఇల్లు లేక దైన్యం..
తిమ్మాపూర్: అద్దె ఇళ్లలో ఉంటున్నవారి దైన్య పరిస్థితికి అద్దం పట్టే సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పాత నుస్తులాపూర్‌లో జరిగింది. నుస్తులాపూర్‌కు చెందిన ఎన్నం రాజిరెడ్డి తమ గ్రామం ఎల్ఎండీలో మునిగిపోవడంతో 35 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా రామకృష్ణకాలనీకి వచ్చారు. ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్లారు. రాజిరెడ్డికి ఇద్దరు బిడ్డలు, ఓ కొడుకు సంతానం కాగా, పెద్ద బిడ్డకు పెళ్లి చేశాడు. రాజిరెడ్డి దంపతులు కొడుకు సత్తిరెడ్డి, చిన్న కూతురు పటాన్‌చెరువులో కూలీ పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం సత్తిరెడ్డితోపాటు తల్లి సారమ్మ అనారోగ్యానికి గురయ్యారు. శనివారం సాయంత్రం సత్తిరెడ్డి మృతి చెందగా, శవాన్ని తీసుకెళ్లాలని ఇంటి యజమాని అంబులెన్స్‌ని మాట్లాడి పంపించారు.
దీంతో దిక్కులేని స్థితిలో ఆదివారం రామకృష్ణకాలనీ చేరుకున్నారు. ఇక్కడ రాజిరెడ్డి సోదరుడు లకా్ష్మరెడ్డి ఉన్నా అతనికి భార్యాపిల్లలు, ఇల్లు లేదు. దీంతో శవాన్ని ఎవరి ఇంటికి తీసుకెళ్లాలనే సమస్య వచ్చింది. దీంతో రాజిరెడ్డి బంధువు బాపురెడ్డి, స్థానికుడు దావు సంపత్‌రెడ్డిలు మృతదేహాన్ని రోడ్డుకు పక్కగా ఉన్న చెట్టు కింద పడుకోబెట్టారు. గ్రామస్తులతోపాటు మొలంగూర్‌లో ఉంటున్న బంధువులు ఆర్థికసాయం అందించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం రాజిరెడ్డి కుటుంబానికి రామకృష్ణకాలనీలోనే ఉంటున్న ఆయన బంధువు బాపురెడ్డి ఆశ్రయమిచ్చాడు. దావు సంపత్‌రెడ్డి బియ్యం వితరణ చేశారు.