ప్రతి గ్రామానికీ వంద పండ్ల మొక్కలు
ఎంపీడీఓ యాదయ్య
కొందుర్గు : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందించిన పండ్ల మొక్కలను పిల్లల్లా పెంచాలని ఎంపీడీఓ యాదయ్య సూచించారు. సోమవారం ఆయన ఎంపీటీసీలు, సర్పంచ్ల సమక్షంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు కొబ్బరి మొక్కలను పంపిణీ చేశారు. ఇదివరకే 5వేల జామ, 2వేల బాదామి మొక్కలు పంపిణీ చేశామని, ప్రస్తుతం కార్యాలయానికి వచ్చిన 2500 కొబ్బరి మొక్కలను గ్రామానికి 100 చొప్పున అందిస్తున్నామన్నారు. మరో వారం రోజుల్లో మామిడి, బొప్పాయి మొక్కలు కూడా వస్తాయని తెలిపారు. ఈ మొక్కలను నీటివసతి ఉన్న కుటుంబాలకే అందించాలని సూచించారు. ప్రతిమొక్కను పసిపిల్లవాడిని పెంచినట్లు పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పాండు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు సలహాలు అందించారు. గ్రామాల్లో ఇదివరకు నాటిన మొక్కలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తాగునీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.