ఉద్యోగులకు ఊరట
పెన్షన్‌దారులకు ఉపశమనం
జీతాలు, పింఛన్లకు సర్కారు మినహాయింపు
రోజువారీ చెల్లింపులపై నిషేధం కొనసాగింపు
{sెజరీలో రూ.100కోట్ల మేర లావాదేవీలకు బ్రేకు
విశాఖపట్నం: జీతాలు..పింఛన్ల చెల్లింపులకు కాస్త మినహాయింపునివ్వడంతో ఉద్యోగులు, పెన్షన్‌దారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. బిల్లుల సమర్పణలో జాప్యంతో జీతభత్యాలు అందుకోవడానికి మరో నాలుగుఐదు రోజుల సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే రోజువారీ చెల్లింపులపై మాత్రం నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.వివరాలిలా ఉన్నాయి. ఆర్థిక లోటుతో ట్రెజరీద్వారా చెల్లింపులపై నిషేధంతో వారం రోజులుగా రోజువారీ చెల్లింపులకు బ్రేకులు పడ్డాయి. దీంతో జనవరి జీతాలు, పింఛన్లు వస్తాయో లేదోనని ఉద్యోగులు, పింఛన్‌దారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారం రోజులుగా శాఖలు జీతభత్యాల బిల్లులను సమర్పించేందుకు ప్రయత్నించినా ట్రెజరీ అధికారులు ససేమిరా అన్నారు. మరొక పక్క రోజువారీ చెల్లింపులు నిలిచిపోవడంతో ట్రెజరీతో పాటు శాఖల వారీగా వందల్లో బిల్లులు పేరుకుపోయాయి. రోజుకు ట్రెజరీ ద్వారా రూ.15కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. గత నెల 27వ తేదీన నిషేధం ఉత్తర్వులు జారీతో వారం రోజులుగా సుమారు వందకోట్ల రూపాయల మేర చెల్లింపులు నిలిచిపోయాయి.
మరొక పక్క హుద్ హుద్ బాధితులకు రూ.320 కోట్ల మేర పరిహారం విడుదల కాగా, ఇప్పటి వరకు 80 శాతం వరకు బ్యాంకులకు జమయ్యాయి.మరో 20 శాతం జమకావాల్సి ఉంది. జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు 40వేలమంది ఉండగా, 12వేల మంది వరకు అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. సుమారు 25వేల మంది పింఛన్‌దారులున్నారు. జీత భత్యాల రూపంలో ఉద్యోగులకు రూ.110కోట్లు, అవుట్సోర్సింగ్/కాంట్రాక్టు సిబ్బందికి రూ.10కోట్లు చెల్లిస్తుండగా, పింఛన్‌దారులకు రూ.50కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. వారం రోజులుగా జీతభత్యాలు, పింఛన్లు అందుతాయో లేదోనని తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. సోమవారం ఉదయం ఉద్యోగులకు జీతభత్యాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ల చెల్లింపులకు మినహాయింపు నివ్వగా, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో టెన్షన్ కొనసాగింది. అయితే సోమవారం సాయంత్రానికి వారికి కూడా మినహాయింపు నివ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేవలం గత నెలకు మాత్రమే పరిమితం చేశారు. పాత బకాయిలు చెల్లించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఇక రోజువారీ చెల్లింపులపై విధించిన నిషేధాన్ని మరికొంతకాలం కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.