సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకూ హ్యాకింగ్ ముప్పు
హెల్సింకీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు హ్యాకింగ్ ముప్పు ఉందా? ఉందని చెబుతున్నారు ఫిన్లాండ్కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఎఫ్ సెక్యూర్’ సంస్థ నిపుణులు మిక్కో హిప్పోనెన్. ఇప్పటికే ఇలాంటి హ్యాకర్స్ ఉన్నారని, వారే రష్యాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ‘రాన్సమ్వేర్’ హ్యాకర్లని ఆయన తెలిపారు.
వీరు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలోని కంప్యూటర్ వ్వవస్థలోకి ప్రవేశించి, వైరస్ ఎక్కించడం ద్వారా కారు కంట్రోల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారని, కారు యజమాని రాన్సమ్ (వారు అడిగినంత డబ్బు చెల్లిస్తేనే) చెల్లిస్తేనే కారుకు మళ్లీ యాక్సెస్ కల్పిస్తారని హిప్పోనెస్ చెబుతున్నారు. రాన్సమ్వేర్ హ్యాకర్లు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను యాక్సిడెంట్లకు గురిచేస్తారన్న భయం తనకు లేదని, వారూ డబ్బుకోసం హ్యాకింగ్ చేసే తత్వానికి చెందిన వారని ఆయన చెప్పారు.
డ్రైవర్‌లెస్ కార్లను తీసుకొచ్చేందుకు కొన్ని కంపెనీలు ఇప్పటికే పోటీ పడుతున్న విషయం తెల్సిందే. వాటిలో గూగుల్ కంపెనీ కాస్త ముందుండి తన డ్రైవర్‌లెస్ కారుకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న విషయమూ తెల్సిందే. మరో రెండేళ్లలో డ్రైవర్‌లెస్ కార్లను తీసుకొస్తామని ‘టెల్సా మోటార్స్’ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. రానున్న కాలమంతా డ్రైవర్‌లెస్ కార్లదేనని, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 25 శాతం కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే ఉంటాయని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.
మరి, ఈ హ్యాకింగ్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను రక్షించుకోవడం ఎలా? అని హిప్పోనెన్ను ప్రశ్నించగా, ఎప్పటికప్పుడు పటిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసుకుంటూ పోవడమేనని, ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయగానే దానిలో ఉన్న లొసుగులను పట్టుకొని హ్యాకర్లు పుట్టుకొస్తుంటారని, వారి బారిన పడకుండా తప్పించుకొనేందుకు నిరంతర ప్రక్రియ అనువైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసుకుంటూ పోవడం ఒక్కటే దారని ఆయన అన్నారు. ఇటీవల గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు యాక్సిడెంట్‌కు గురవడం హ్యాకర్ల వల్ల జరగలేదని, ఎదురుగా వస్తున్న బస్సును సెన్సర్లు సరిగ్గా గుర్తించక పోవడం వల్లనే జరిగిందని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.