శిధిలాల నుంచి సజీవంగా.. 105ఏళ్ల వృద్ధుడు
కాఠ్మండూ: అదృష్టం, ఆయుష్షు ఉండాలే కానీ పెను విపత్తు కూడా ఏమీ చేయలేదు! శిథిలాల కింది చిక్కుకుపోయిన 105 ఏళ్ల వృద్ధుడు 8 రోజులపాటు మృత్యువుతో పోరాడి సురక్షితంగా బయటపడ్డాడు. భూకంపం ధాటికి మరుభూమిగా మారిన నేపాల్లో ఈ సంఘటన వెలుగు చూసింది.
8 రోజుల క్రితం సంభవించిన భారీ భూకంప ప్రభావానికి నేపాల్లో 7 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ పెను విషాదం నుంచి నేపాల్ ఇంకా కోలేకోలేకపోతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం నువకోట్ జిల్లా కిమ్ టంగ్ గ్రామంలో శిథిలాలను తొలగిస్తుండగా, ఫంచు ఘలె అనే శతాధిక వృద్ధుడు శిథిలాల కిందపడిఉన్నాడు. భూకంపం ధాటికి ఫంచు ఇళ్లు నేలమట్టమైంది. స్వల్పంగా గాయపడ్డ ఫంచు శిథిలాల కింద ఉన్నట్టు సహాయక సిబ్బంది గుర్తించారు. వెంటనే నేపాల్ ఆర్మీ హెలీకాప్టర్ ద్వారా ఆయనను చికిత్స నిమిత్తం త్రిశూలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఫంచు క్షేమంగా ఉన్నట్టు వైద్య వర్గాలు తెలిపాయి.