మార్కెట్ కు క్రూడ్ షాక్!
* ఇరాక్ యుద్ధ భయాల ఎఫెక్ట్
*348 పాయింట్లు పతనం 4 నెలల్లోనే అత్యధికం
* 25,228కు దిగిన సెన్సెక్స్ 108 పాయింట్లు పడ్డ నిఫ్టీ
*దెబ్బతిన్న ఆయిల్ షేర్లు రియల్టీ, మెటల్, బ్యాంకింగ్ డీలా చిన్న షేర్లు విలవిల
ఇరాక్‌లో చెలరేగిన యుద్ధ మేఘాలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 113 డాలర్లను అధిగమించగా, నెమైక్స్ సైతం 107 డాలర్లను తాకింది. ఇవి మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు ఆందోళనలకు తెరలేపాయి. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు చమురు భయాలు వ్యాపించాయి. ఫలితంగా యూరప్‌లోని యూకే, ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు 1% నష్టాలతో మొదలయ్యాయి.
ఈ ప్రభావంతో తొలుత లాభాలతో కదిలిన దేశీ మార్కెట్లు సైతం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నష్టాలకు లోనయ్యాయి. ఆపై అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ 25,688 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి మిడ్ సెషన్లో 25,172 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరి వరకూ నష్టాలలోనే కదిలి 348 పాయింట్లు పోగొట్టుకుంది. ఇంతక్రితం జనవరి 27న మాత్రమే ఈ స్థాయిలో 426 పాయింట్లు పతనమైంది.
రూపీ ఎఫెక్ట్ కూడా: డాలరుతో మారకంలో రూపాయి నెల రోజుల కనిష్టం 59.68కు చేరడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచిందని విశ్లేషకులు పేర్కొన్నారు.ఏప్రిల్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) పుంజుకోవడంతోపాటు, మే నెలకు రిటైల్ ద్ర వ్యోల్బణం నీరసించడంతో మార్కెట్లు తొలుత లాభాలతో మొదల య్యాయని తెలిపారు. అయితే ఇరాక్ ఆందోళనలు, యూరప్ మార్కెట్ల నష్టాలు అమ్మకాలకు దారితీశాయని విశ్లేషించారు. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా, రియల్టీ అత్యధికంగా 5% కుప్పకూలింది. ఈ బాటలో పవర్, మెటల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, ఆటో రంగాలు 3.5-1.5% మధ్య క్షీణించాయి.
సెన్సెక్స్‌లో నాలుగే: సెన్సెక్స్‌లో హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం మాత్రమే నామమాత్రంగా లాభపడ్డాయి.
బ్లూచిప్స్ బేర్: మిగిలిన బ్లూచిప్స్‌లో హీరోమోటో, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హిందాల్కో, టాటా పవర్, మారుతీ, భెల్, టాటా మోటార్స్, భారతీ, ఎల్అండ్టీ 4-2% మధ్య నీరసించాయి.
బ్యాంకింగ్ డీలా: బ్యాంకింగ్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్, కెనరా, బీవోబీ, ఎస్బీఐ, ఫెడరల్, ఇండస్ఇండ్, పీఎన్బీ, ఐసీఐసీఐ 6-2% మధ్య డీలాపడ్డాయి.
రియల్టీ బోర్లా: రియల్టీ షేర్లు డీబీ, డీఎల్ఎఫ్, అనంత్‌రాజ్, శోభా, హెచ్‌డీఐఎల్, యూనిటెక్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండియాబుల్స్ 8.5-3.5% మధ్య తిరోగమించాయి.
చమురు షేర్లు ఢమాల్: ఆయిల్ మార్కెటింగ్ షేర్లలో హెచ్‌పీసీఎల్ 8% పడిపోగా, బీపీసీఎల్, ఐవోసీ, ఇంద్రప్రస్థ గ్యాస్, గెయిల్, ఆయిల్ఇండియా, కెయిర్న్, ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ 5-1% మధ్య నష్టపోయాయి.
స్మాల్ క్యాప్ 3% డౌన్: మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 3% స్థాయిలో పతనమయ్యాయి.
10-8% మధ్య: మిడ్ క్యాప్స్‌లో ఎంటీఎన్ఎల్, యూఫ్లెక్స్, హెచ్ఎంటీ, సింటెక్స్, జేపీ, షిప్పింగ్ కార్ప్, ఆర్కిడ్, జీఐసీ, శ్రేయీ ఇన్ఫ్రా, పుంజ్‌లాయిడ్, నవభారత్, టీబీజెడ్, రుచీ సోయా, ఎస్సార్ పోర్ట్స్ 10-8% మధ్య జారుకున్నాయి.
శుక్రవారం 13... బాబోయ్
ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం 13వ తేదీ ఒకే రోజు వచ్చాయంటే ఇన్వెస్టర్లకు ఆందోళనే. ఇది దేశీయంగానూ కనిపిస్తుండటం విశేషం! ఇప్పటివరకూ శుక్రవారం 13వ తేదీ వచ్చిన రోజున దేశీ స్టాక్ మార్కెట్లు నాలుగుసార్లు పతనమయ్యాయి. తాజాగా ఇరాక్ అంతర్యుద్ధ భయాలతో ఈ సెంటిమెంట్ మరోసారి ప్రభావం చూపింది. వెరసి మార్కెట్లు వరుసగా ఐదు సార్లు 13వ తేదీ శుక్రవారం పతనమైన రికార్డును నెలకొల్పడం గమనార్హం.