ప్రొఫెషనల్ బాక్సర్‌గా పింకీ జాంగ్రా
న్యూఢిల్లీ: ప్రపంచ మాజీ చాంపియన్ సరితా దేవి స్ఫూర్తితో మరో మహిళా భారత బాక్సర్ ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయించుకుంది. హరియాణాకు చెందిన 26 ఏళ్ల పింకీ రాణి జాంగ్రా ప్రొఫెషనల్ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్ వ్యవహారాలను పర్యవేక్షించే స్పోర్టీ బాక్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఆమె ఒప్పందం చేసుకుంది. ‘ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయించుకున్నాను. అయితే అమెచ్యూర్ కెరీర్ కూడా కొనసాగిస్తాను.
వచ్చే ఏడాది జరిగే ఆసియా, కామన్వెల్త్ క్రీడలపై దృష్టి పెట్టాను. ప్రొఫెషనల్‌గా మారిన బాక్సర్లు కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అర్హులని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం నిబంధనలు మార్చింది. దాంతో కొత్తదనం కోసం ప్రొఫెషనల్‌గా మారుతున్నాను’ అని 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన పింకీ తెలిపింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈనెల 19న సరితా దేవితోపాటు పింకీ జాంగ్రా తొలి ప్రొఫెషనల్ బౌట్ జరుగుతుంది.