పండగనాడూ పస్తులే...
రోజు రోజుకు పెరుగుతున్న నిత్యవసర సరకుల ధరలతో పూట గడవడం కూడ కష్టమైపోయింది. పేదోడి ఇంట పండగ సంతోషం కనిపించడమే కష్టమైంది. రాబడి తగ్గి ఖర్చులు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకు భారమైంది. దసరా పండగకు పిండి వంటలు కాదుకదా, పస్తులు తప్పేలా లేవంటున్నారు.
గురజాల/పొన్నూరు రూరల్/సత్తెనపల్లిరూరల్ :
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిత్యవసర సరకుల ధరలు పలుమార్లు పెరిగాయి. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ధరలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైంది. పెరుగుతున్న ధరలతో సామాన్య మధ్య తరగతి ప్రజలు బెంబెలెత్తుతున్నారు.
కనీస తిండికి అవసరమయ్యే బియ్యం కిలో ధర రూ.48కి పైమాటే. చింతపండు రూ.65, ఉప్పు రూ.12గా వున్నాయి. ఇంతంత ధరల్లో కొనుగోలు చేయలేని పేదలు వీటిల్లో తక్కువ రకం ఎంచుకుని అర కిలోలతో సరిపెట్టుకుంటున్నారు. పండగ పూట కూడా పస్తులే ఉంటున్నారు.
కొండెక్కిన కూరగాయల ధరలు...
నిత్యవసర సరకులతో పాటు కూరగాయల ధరలు కూడ కొండెక్కా యి. బెండ, క్యారె ట్, బీన్స్, బంగాళదుంపలు కొనలేని ధరల్లో ఉన్నాయి. పండగ రోజు కూడా చింతపండు పులుసుతో పేద ప్రజలు సరిపుచ్చు కోవాల్సి వస్తోంది.
రేషన్ రాక ఇబ్బందులు
పొన్నూరు రూరల్
పొన్నూరు పట్టణ, మండల పరిధిలో తెలుపు, అంత్యోదయ, అన్న పూర్ణ కార్డుదారులు మొత్తం 39,719 ఉన్నారు. వీరందరికి ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా అందించాల్సిన నిత్యవసర సరకులు కొన్ని నెలలు నుంచి అందకపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో ఏదైనా పండగ వచ్చిందంటే చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం పంచదారను అదనంగా కేటాయించి విక్రయించేది.
ప్రస్తుతం అదనం కాదుగదా, ఉన్నవాటికే దిక్కు లేదని మహిళలు వాపోతున్నారు.
నేటికీ తెరుచుకోని ఆన్లైన్
సత్తెనపల్లిరూరల్ : ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా, బియ్యం, పంచదార, కిరోసిన్‌తో పాటుగా పలు నిత్యవసరాలను సబ్సిడీ పై రేషన్‌కార్డుల ద్వారా సరఫరా చేయాలి. సెప్టెంబరు నెల ముగిసినా సరకులకు సంబంధించి డీడీల చెల్లింపు నేటికీ పూర్తికాలేదు. తెలుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు ఉన్న చౌక దుకాణాల డీలర్లను మార్చాలని ఆ పార్టీ నేతలు తెస్తున్న ఒత్తిళ్ల కారణంగా డీడీల ప్రక్రియ నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
ప్రతి నెలా 16వ తేదీ నుంచి 18లోపు సరకులకు సంబంధించి డీడీలు తీయాలి. అనంతరం దుకాణదారుడు స్టాకు రిపోర్టు అందిస్తే, ఎలాట్మెంట్ ఇచ్చి నెలాఖరులోపు సరకులు సరఫరా చేస్తారు. అనంతరం కార్డుదారులకు ఒకటో తేదీ నుంచి 15లోపు సరకుల పంపిణీ చేస్తారు.
సత్తెనపల్లి మండల ంలోనే నిలిపివేత...
సత్తెనపల్లిలోని ఎమ్ఎల్ఎస్ పాయింట్ నుంచి సత్తెనపల్లి పట్టణం, మండలం,ముప్పాళ్ల, మేడికొండూరు మండలాలకు నిత్యవసరాలను సరఫరా చేస్తారు.
సత్తెనపల్లి మినహా అన్ని మండలాలకు నిత్యవసర సరకులు సరఫరా ప్రక్రియ పూర్తి కాగా, సత్తెనపల్లికి మాత్రం డీడీలు చెల్లించేందుకు నేటికీ ఆన్లైన్ ఇవ్వలేదు.
మండలంలో సుమారు 72 దుకాణాలకు 34,200కు పైగా కార్డుదారులు ఉన్నారు. పండగ రోజుల్లో పస్తులు ఉండాల్సి వస్తోందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబరు నెల పూర్తయినా నేటికీ సరకులు అందక పోవటం పై డీలర్లు, కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై తహశీల్దార్ కె.వి.శ్రీనివాసరావును వివరణ కోరగా ప్రతి నెలా 26వ తేదీలోపు డీలర్లు డీడీలు కట్టించాల్సి ఉంది. అధికారుల బదిలీల నేపథ్యంలో ఆ ప్రక్రియ నిలిచిపోయినట్లు ఈ రోజే తన దృష్టికి వచ్చిందన్నారు. అందరికీ ఎలాట్మెంట్ కేటాయించి డీడీలు కట్టించి రెండు రోజుల్లో సరకులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.