ఫైబర్ ఆప్టిక్ పథకానికి సహకారం
► దావోస్లో సీఎంకు సిస్కో హామీ
► దావోస్ నుంచి సింగ్పూర్కు వెళ్లిన చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక సదస్సు చివరిరోజున దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్ సీఎం చంద్రబాబుతో సమావేశమైనపుడు రాష్ర్ట ప్రభుత్వం ఇంటింటికీ ఫైబర్ ఆప్టిక్ సదుపాయం కల్పించే పథకానికి సహకారం అందిస్తామని చెప్పారని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఇక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో సీఎం భేటీ అయినపుడు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఈసారి ఏపీ కేంద్ర బిందువైందని చెప్పారు. భారత దేశం అంటే ఏపీ అన్నట్లు ఉందని ప్రశంసించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రైవేటు రంగంతో పాటు ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి నిధుల సేకరణకు కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న మెకన్సీ గ్లోబల్ కంపెనీ సీఈవో డొమినిక్ బార్టన్తో చంద్రబాబు సమావేశమయ్యారు.
రాష్ట్రంలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండోరమ సింథటిక్ కంపెనీ సీఈవో శ్రీ ప్రకాష్ లోహియా.. సీఎంకు చెప్పారు. సంస్థ ఏర్పాటుపై అధ్యయనానికి మార్చిలో బృందాన్ని పంపనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య పరికరాల ఉత్పత్తి సంస్థ మెడ్ ట్రానిక్ సీఈవో మైఖెల్ కోయిల్తో చంద్రబాబు భేటీ అయిన సందర్భంగా.. పేదలకు గుండె జబ్బుల వైద్యం అందుబాటులోకి తేవాలని కోరారు.
సన్గ్రూప్ చైర్మన్ శివ్ఖేమ్కా, ఫోర్టిస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల చైర్మన్ మల్వీందర్ సింగ్, సేల్స్ ఫోర్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ కుంద్రా, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) అధ్యక్షుడు షిన్షి కిటావొకాలతో కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా దావోస్ పర్యటన ముగించుకుని చంద్రబాబు సింగపూర్ వెళ్లారు. అక్కడ ఆయన రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ఆ దేశ మంత్రి ఈశ్వరన్ తదితరులతో చర్చించనున్నారు.