సంక్షోభంలో సంక్షేమం: సుబ్రతా రాయ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమం, అభివృద్ధికి ఉపయోగపడే పథకాలను రద్దుచేసే ప్రయత్నాలు చేస్తున్నాయని, వీటిని సంఘటితంగా ఎదుర్కోవాలని సెంటర్ ఫర్ బడ్జెట్ గవర్నెన్స్ అకౌంటబులిటీ జాతీయ సమన్వయకర్త సుబ్రతారాయ్ అన్నారు. శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర బ్రడ్జెట్ కన్సల్టేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 32 నుంచి 42 శాతానికి పెంచామంటూనే సంక్షేమ పథకాల్లో భారీగా కోత విధిస్తోందన్నారు.
కేంద్రం చర్యల వల్ల దాదాపు 70 సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా సంక్షేమరంగం సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకుంటున్న మరో నిర్ణయం వల్ల కొత్త చిక్కు రాబోతోందని, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను వేర్వేరుగా కాకుండా కలిపి నిర్ణయించాలని చూస్తోందని, దీనివల్ల ఏవి పథకాలో, ఏవి జీతభత్యాలో తెలియక బలహీన, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. పేదలకు పన్నుపోటు విధిస్తూ కార్పొరేట్శక్తులకు రాయితీలిస్తోందని ఆరోపించారు. సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ అండ్ డెవలప్మెంట్, పీఫుల్స్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాల నిపుణులు, ఎన్జీవోలు పాల్గొన్నారు.