కని పెంచిన అమ్మకే అమ్మ!
ఆదర్శం
గౌరీ త్రివేదీ... గుజరాత్ రాష్ట్రం నుంచి ఎంపిక అయిన తొలి మహిళా ఐఏఎస్... అయితేనేం... ఆమె కూడా ఒక అమ్మకు కూతురే. అలాంటి ఇలాంటి కూతురు కాదు. అనారోగ్యం పాలయిన అమ్మను చూసుకోవడానికి ఐఏఎస్‌గా తన ఉద్యోగాన్ని వదులుకొన్న కూతురు. మనుషులను పెట్టి అమ్మను జాగ్రత్తగా చూసుకొనే శక్తి ఉన్నా... తను మాత్రమే తన తల్లిని శ్రద్ధగా చూసుకోగలనని, అందులో ఉన్న సంతృప్తి ఎంత పెద్ద ఉద్యోగంలోనూ ఉండదని నమ్మి అమ్మపై తన ప్రేమను చాటుకొన్న కూతురు ఆమె.
ఐఏఎస్... దేశంలోని లక్షల మంది యువతీ యువకులకు కలల పంట. సివిల్స్ ర్యాంకర్లుగా ఆ ఉద్యోగాన్ని చేపట్టి అత్యున్నత స్థాయి గౌరవం, అధికారాలతో గొప్ప గుర్తింపుతో వయసు పెరిగే కొద్దీ ఉన్నత స్థాయి పదవులను చేపడుతూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొనే అవకాశం ఉండే ఉద్యోగం అది. 1986లో కర్ణాటక క్యాడర్ ఐఏఎస్‌గా వృత్తిగత జీవితాన్ని ప్రారంభించింది - గౌరీత్రివేది. ఆ రాష్ట్రంలోనే వివిధ శాఖల్లో పనిచేసి ప్రజాప్రతినిధుల తలలో నాలుకగా మెలిగిందామె. ఇలాంటి నేపథ్యంలో 2006లో గౌరి తల్లి గీతాబెన్ ఒక ప్రమాదానికి గురి అయ్యింది. తుంటి ఎముక విరిగి మంచం పట్టింది. గౌరి తండ్రి, సీనియర్ కార్డియాక్ సర్జన్ డా. ఎస్ఏ త్రివేది కూడా అప్పటికే అదే అవస్థలో ఉన్నారు. ఆయన కూడా తొడ ఎముక విరగడంతో బెడ్ రెస్టుకే పరిమితం అయ్యారు. అయితే, తనను పెంచి పెద్ద చేసి, విద్యాబుద్దులు చెప్పించిన వాళ్లను ఆ స్థితిలో వదిలి ఉద్యోగానికి వెళ్లలేకపోయింది గౌరీ త్రివేదీ. పనిమనుషులను నియమించుకొని, నర్సులను సహాయకులుగా పెట్టి వారికి తల్లిదండ్రుల బాధ్యతలను అప్పజెప్పవచ్చు. అయితే మంచానికి పరిమితం అయిన తల్లిదండ్రులను వాళ్ల మానాన వాళ్లను వదిలిపోవడానికి ఆమె మనసొప్పలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి అహ్మదాబాద్ వెళ్లిపోయింది. వృద్ధాప్యంలో అవస్థలు పడుతున్న తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడింది.
అలా ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. గౌరి తల్లిదండ్రులు ఆమె సంరక్షణలో కోలుకొన్నారు. అప్పటికి గానీ గౌరీ మనసు కుదుట పడలేదు.
మధ్యలో ఒకసారి గుజరాత్ పర్యటనకు వెళ్లిన అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి గౌరి గురించి చెప్పారు. ఒక కూతురిగా ఆమె అందరికీ ఆదర్శప్రాయురాలు అని వారిద్దరూ భావించి.. గుజరాత్లో సివిల్ సర్వీస్ రాయడానికి తపించే యువతకు శిక్షణను ఇచ్చే సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆ్‌ఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఎస్‌పీఐపీఏ)లో విద్యార్థులకు మార్గదర్శిగా నియమించారు.
గీతాబెన్, ఎస్ఏ త్రివేదీ దంపతులకు గౌరి కన్నా ముందు ముగ్గురు అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్లంతా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ సెటిలయ్యారు. చివరగా పుట్టిన కూతురే వృద్ధాప్యంలో వాళ్ల పాలిట దేవత అయ్యింది. తన బాధ్యతను గుర్తెరిగి, వాళ్లను సంరక్షించుకొంది.
గౌరి గురించి తెలుసుకొన్న వారెవరైనా ఆమెను ‘అంత మంచి ఉద్యోగాన్ని ఎలా వదులుకోగలిగారు’ అని అడుగుతుంటారు. అలా అడిగిన వారందరితోటీ ‘అమ్మతో నాకున్న అనుబంధం చాలా బలమైనది.. దాన్ని తెంచుకోలేను. ఉద్యోగంతో బంధాన్ని మాత్రం చాలా సులభంగా తెంచేసుకోగలిగాను..’ అంటూ భావోద్వేగపూర్వకంగా సమాధానం ఇస్తుందామె. ఇలాంటి కూతురు ఒకరున్నా చాలు కదూ!