భయపడుతున్న పాక్ క్రికెటర్
కోల్‌కతా : పాక్ పేసర్ మహమ్మద్ ఆమిర్ కోల్‌కతాలో దిగాక లోకల్ సిమ్ కార్డు తీసుకోవాలంటేనే భయపడుతున్నాడట. ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ 2010 నుంచి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న ఈ క్రికెటర్ ఇటీవలే తిరిగి జట్టులో స్థానం పొందాడు. ఈ క్రమంలో నిషేధం అతడిని పీడకలగా వెంటాడుతోంది. కోల్‌కతాకు చేరుకోగానే అధికారులు జట్టు సభ్యులందరికీ లోకల్ సిమ్ కార్డులను అందజేయగా ఆమిర్ మాత్రం సిమ్ కార్డును తిరస్కరించాడు. మ్యాచ్ ఫిక్సర్లు, బుకీల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెబుతున్నాడు.
కాల్ మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారీ సహచర జట్టు సభ్యుల వద్ద ఫోన్ తీసుకుంటున్నాడట. అంతేకాదు పాకిస్తాన్ గెలుపు కోసం ప్రార్థనలు చేస్తున్నాడట. ఖాళీ సమయాల్లో వెలుగుతున్న కొవ్వొత్తి ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నాడని నిర్వహణ అధికారుల్లో ఒకరు తెలిపారు. అయితే జట్టు సభ్యులు మాత్రం ప్రాక్టీస్ లేనప్పుడు ఆమిర్ పాడే 'ఆతీఫ్ అస్లామ్' పాటలకు ఫిదా అయిపోయారు. కాగా శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్న భారత్-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.