కదలకుండానే ఇల్లు తుడవొచ్చు...
ఒకవైపు ఇంట్లో నేలంతా మురికి మురికిగా ఉంటుంది. తుడవాలంటే నడుం వంచక తప్పదు. మరోవైపు టీవీలో నచ్చిన సీరియల్ వస్తూ ఉంటుంది. బద్ధకంగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ గడిపేయాలని ఉంటుంది. అలాగని ఇంటిని మురికిగా వదిలేయాలని కూడా అనిపించదు. ఇలాంటి విపత్కర సమస్యకు పరిష్కారమెలా అని ఆలోచిస్తున్నారా..? ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫ్లోర్ డస్టర్ ఒకటి ఇంట్లో ఉంటే చాలు... మీరు సోఫాలోంచి ఏమాత్రం కదలనక్కర్లేదు. నేలను శుభ్రం చేయడానికి నడుం వంచి కష్టపడనవసరమే లేదు.
ఒక చేత్తో టీవీ రిమోట్ పట్టుకుని చానెల్స్ మార్చేస్తూ ఉన్నట్లే, మరో చేత్తో ఈ ఫ్లోర్ డస్టర్ రిమోట్ కూడా పట్టుకుని, కావలసిన దిశలో దీనిని మళ్లిస్తూ ఉంటే చాలు... ఇల్లంతా ఇట్టే శుభ్రం చేసేస్తుంది. ‘రూంబా’ పేరిట ఒక జపాన్ కంపెనీ ఈ ఫ్లోర్ డస్టర్‌ను రూపొందించింది. దీనికోసం మొత్తం ఆరు ‘ఏఏ’ సైజు బ్యాటరీలు కావాల్సి ఉంటుంది. నాలుగు బ్యాటరీలను డస్టర్‌లో, రెండింటిని రిమోట్లో అమర్చుకోవాల్సి ఉంటుంది.