పుష్పం సమర్పయామి!
వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని పుష్పయాగం సోమవారం కనుల పండువగా నిర్వహించారు. ముందుగా సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను ఆలయ రంగమంటపంలో శేషవాహనం పడగ కింద ఆశీనులను చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన అనేక రకాల పూలతో స్వామిని పూజించారు. పుష్పయాగానికి అశేషంగా ప్రజలు తరలివచ్చారు.
కార్యక్రమంలో కలెక్టర్ కేవీ రమణ దంపతులు పాల్గొన్నారు. కోదండరాముని బ్రహ్మోత్సవంలో భాగంగా చివరి రోజు సోమవారం ఆలయ గర్భగుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పాన్పుపై సీతారాములను ఆసీనులను చేశారు. వివిధ రకాల పుష్పాలు, ఫలాలతో స్వాములవారి పాన్పును సుందరంగా అలంకరించారు. ఏకాంత సేవలో కొలువుదీరిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. - ఒంటిమిట్ట