ఈ రెండింటికి బలయ్యాను: అనుపమ
బెంగళూరు: అవినీతి రాజకీయాలకు, వ్యవస్థలోని లోపాలకు తాను బలయ్యానని మాజీ డీఎస్పీ అనుపమ షెనాయ్ అన్నారు. కర్ణాటక మహిళ కమిషన్ ఎదుట హాజరై అనుపమ తన వాదనలు వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘మొత్తం సమాజం, వ్యవస్థ అంతటా పురుషాధిక్యమే. పురుష భావజాలం ప్రకారం వ్యవస్థ నడుస్తోంది. వ్యవస్థకు, అవినీతి రాజకీయాలకు నేను బలయ్యాను’ అని అన్నారు.
మంత్రి తన విధుల్లో జోక్యం చేసుకుంటూ, ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ బళ్లారి జిల్లా కుద్లిగి డీఎస్పీ అనుపమ ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ ఒత్తిడితో బళ్లారి ఎస్పీ చేతన్ తనను వేధిస్తున్నారంటూ కర్ణాటక మహిళ కమిషన్కు అనుపమ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మహిళ కమిషన్ ఎదుట హాజరై అనుపమ తాను ఎదుర్కొన్న సమస్యలను ఏకరవు పెట్టారు. పురుషాధిక్య వ్యవస్థలో మహిళ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారమార్గాలు వెతకాలని కోరారు. డీఎస్పీ ఉద్యోగం తనకు ఎలాంటి మానసిక ప్రశాంతత ఇవ్వలేదని, ప్రస్తుతం తాను ప్రశాంతంగా ఉన్నానని అన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ కేసును ఈ నెల 16కు వాయిదా వేసినట్టు మహిళ కమిషన్ చీఫ్ మంజుల మానస చెప్పారు.