షట్లర్లకు ‘టాప్’ సాయం
న్యూఢిల్లీ: టార్గెట్ ఓలింపిక్ పోడియం (టాప్) పథకానికి ఎంపికై పుల్లెల గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నలుగురు షట్లర్ల సౌకర్యార్థం మంగళవారం కేంద్రం నిధుల్ని విడుదల చేసింది. జిమ్ పరికారాల కోసం రూ. 30 లక్షలు, ఫిజియోథెరపిస్ట్కు నెలకు రూ. 40వేలు, ఇతరత్ర ఖర్చుల కోసం నెలకు రూ. 50వేల చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపింది. జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్ఎస్డీఎఫ్) నుంచి ఈ నిధుల్ని విడుదల చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ సౌకర్యాల్ని ఈ నలుగురు ఆటగాళ్లకు మినహా వేరే వ్యక్తులు వాడరాదని తెలిపింది. ఈ పరికరాలపై యాజామన్య హక్కులు భారత క్రీడాప్రాదికార సంస్థ (సాయ్)కు చెందుతాయని వెల్లడించింది. ప్రఖ్యాత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్, గురుసాయిదత్ టాప్ పథకానికి ఎంపికై, అకాడమీలో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే.